"గీతాచార్యుడు" కృష్ణపరమాత్మ జన్మాష్టమినాడు సూర్యోదయమునకు పూర్వమే లేచి చల్లని నీటిలో "తులసీదళము" లను ఉంచి స్నానమాచరించిన సమస్త పుణ్య తీర్థములలోను స్నానమాచరించిన పుణ్యఫలాన్ని పొందుతారని విశ్వాసం.
ఆ రోజు సర్వులూ వారి వారి గృహాలను ముత్యాల ముగ్గులతో, పచ్చని తోరణాలతో కృష్ణపాదాలను రంగవల్లికలతో తీర్చిదిద్ది ఆ కృష్ణ పరమాత్మను ఆహ్వానం పలుకుతూ, ఊయలలో ఓ చిన్ని కృష్ణుని ప్రతిమను వుంచి, రకరకాల పూలతో, గంథాక్షతలతో యధావిధిగా పూజించి, ధూపదీప నైవేద్యములతో ఆ స్వామిని ఆరాధించి భక్తులకు తీర్థ ప్రసాదములు, దక్షిణ తాంబూలములు సమర్పించుకొనుట ఎంతో మంచిది. ఇంతేకాక చాలా చోట్ల కృష్ణపరమాత్మ లీలల్లో ఒక లీలగా ఉట్టికుండ కొట్టే కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉంటారు.
ఓ కృష్ణా! మరణసమయాన నిన్ను స్మరించుచూ నీలో ఐక్యమవ్వాలని కోరిక ఉన్నది కాని! ఆ వేళ కఫవాత పైత్యములచే కంఠము మూతపడిపోయి నిన్ను స్మరించగలనో! లేనో? అని తలచి ఇప్పుడే నా 'మానస రాజవాస' ను శతృఅబేధ్యమైన "నీపాద పద్మ వజ్రపంజర" మందు ఉంచుతున్నాను తండ్రీ. అంటూ పై మంత్రాన్ని శ్రీకృష్ణాష్టమి రోజున పఠించిన వారికి సుఖ సంతోషాలు చేకూరుతాయి.