వెన్నముద్దల దొంగతనంలోనూ దేవరహస్యం!

WD
జయతు జయతు దేవో దేవకీ నందనోయం
జయతు జయతు కృష్ణో వృష్ణి వంశ ప్రదీపః
జయతు జయతు మేఘ శ్యామలః కోమలాంగో
జయతు జయతు పృధ్వీభారనాశో ముకున్దః ||

తాత్పర్యం: ఓ దేవకీ నందనా! ఓ వృష్ణివంశ మంగళ దీపమా! సుకుమార శరీరుడా! మేఘశ్యామ! భూభారనాశక ముకుంద! నీకు సర్వదా జయమగుగాక!.

దేవకీ వసుదేవులకు జన్మించి, యశోద కుమారుడిగా పెరిగిన ఆ బాలకృష్ణుడు దినదిన ప్రవర్థమాన మగుచూ తన లీలావినోదాలచే బాల్యమునుండే.. అడుగడుగునా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. అందులో ముఖ్యంగా వెన్నముద్దలు దొంగలిస్తూ వెన్నదొంగగా ముద్రవేసుకున్నాడు.

అలా వెన్నముద్దల దొంగతనంలో కూడా మానవులకు అందని దేవరహస్యం ఉందట. వెన్న జ్ఞానానికి సంకేతమని, పెరుగును మధించగా మధించగా వెన్న లభ్యం అవుతుంది. అట్టి తెల్లని వెన్నను తాను తింటూ, ఆ అజ్ఞానమనే నల్లను కుండను బద్దలు కొట్టి మానవులలో జ్ఞానజ్యోతిని వెలిగించడమే కృష్ణ సందేశంగా భావించాలని పురోహితులు చెబుతూ ఉంటారు.

అలాగే గోపికలు కుండలలో ఇండ్లకు నీళ్లను యమునానదిలో నుండి తీసుకుని వెళుతూ ఉంటే.. శ్రీకృష్ణుడు రాళ్లను విసిరి ఆ కుండలకు చిల్లులు పెట్టేవాడట. అలా ఆ కుండ మానవ శరీరము అనుకుంటే ఆ కుండలోని నీరు "అహంకారం". ఆ అహంకారం తొలగిపోతేగానీ జీవికి ముక్తి లభించదని శ్రీకృష్ణ లీలల్లోని ఆంతర్యాల్ని భాగవోత్తములు వివరిస్తూ ఉంటారు.

వెబ్దునియా పై చదవండి