రాష్ట్ర రాజధానిలో మళ్లీ విస్తరిస్తున్న స్వైన్ ఫ్లూ

మంగళవారం, 9 మార్చి 2010 (12:28 IST)
FILE
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మళ్లీ స్వైన్ ఫ్లూ విజృంభిస్తున్న జాడలు కనిపిస్తున్నాయి. స్వైన్ ఫ్లూ మహమ్మారి ఇంకా నగరాన్ని వీడినట్లు కనిపించడం లేదు. ప్రస్తుతం నగరంలో ఎండలు మండుతున్నా స్వైన్ ఫ్లూ నగర వాసులను భయపెడుతోంది.

స్వైన్ ఫ్లూ బారిన పడిన ప్రజలు చికిత్స నిమిత్తం ప్రధానంగా నగరంలోని పలు కార్పోరేట్ ఆసుపత్రులకు వెళ్తుండటంతో స్వైన్ ఫ్లూ కేసుల విషయాలు బయటకు రావడం లేదు. అయితే ఇదివరకటిలా భారీ సంఖ్యలో స్వైన్ ఫ్లూ కేసులు లేకపోయినా నగరంలో ఇంకా కొన్ని కేసులు నమోదవుతున్నట్లు సమాచారం. ఇటీవల తాజాగా ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ బారిన పడిన ఓ యువతి చికిత్స పొందుతోంది. శ్రీనగర్‌ కాలనీకి చెందిన ఈమె ఇటీవలే హాంగ్‌కాంగ్‌కు వెళ్లి వచ్చిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

గత మూడు రోజులుగా ఆమెకు తీవ్రమైన జ్వరం ఉండటంతో చికిత్స నిమిత్తం స్థానిక కార్పోరేట్ ఆసుపత్రికి వెళ్లింది. ఆమెలో స్వైన్‌ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో ఆమె నుండి సేకరించిన నమూనాలను పరీక్షల నిమిత్తం ఐపీఎంకు పంపించడం జరిగిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. పరీక్షలో స్వైన్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ కావడంతో ఆమెకు చికిత్సలు అందిస్తున్నామని, అయితే ఆమెకు స్వైన్ ఫ్లూ అంత తీవ్రంగా లేదని, మందులతో తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి