ఇదొక అత్యుత్తమ విజయం: ధోనీ

పాకిస్థాన్‌తో వార్మప్ మ్యాచ్‌లో విజయాన్ని టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జట్టు సాధించిన ఒక అత్యుత్తమ విజయంగా వర్ణించాడు. పాకిస్థాన్‌తో బుధవారం జరిగిన ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ విజయం అనంతరం ధోనీ మాట్లాడుతూ.. తామిప్పటివరకు ఆడిన మ్యాచ్‌లో ఇదొక అత్యుత్తమ మ్యాచ్ అని చెప్పాడు. అయితే వచ్చే రోజులు కష్టంగా ఉంటాయని అభిప్రాయపడ్డాడు. ఈ తరహా ఆటతీరును భవిష్యత్‌లో కనసాగించడం కష్టమని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (80) విధ్వంసకర బ్యాటింగ్, గంభీర్ (52 నాటౌట్) అర్ధ సెంచరీ సాధించడంతో టీం ఇండియా చిరకాల ప్రత్యర్థిపై సునాయాస విజయం సాధించింది.

రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో ఉండటంతో.. ప్రపంచకప్ మ్యాచ్‌లలో పాల్గొనే జట్టులో అతని చోటు ఖాయమేనా అని అడిగిన ప్రశ్నకు ధోనీ సమాధానమిచ్చేందుకు నిరాకరించాడు. గాయంతో బాధపడుతున్న వీరేంద్ర సెహ్వాగ్ స్థానంలో రోహిత్ శర్మ వార్మప్ మ్యాచ్‌లలో ఆడాడు. సెహ్వాగ్ భుజం గాయం నుంచి కోలుకున్న తరువాత కూడా శర్మ జట్టులో ఉంటాడా అని అడిగిన ప్రశ్నకు ధోనీ సమాధానమిస్తూ.. ఇది చెప్పడం కష్టమన్నాడు.

దీనికి సంబంధించి ఇప్పుడు తానేమీ మాట్లాడాలనుకోవడం లేదన్నాడు. గాయం కారణంగా పేస్ బౌలర్ జహీర్ ఖాన్ బంగ్లాదేశ్‌తో జరిగే తొలి ప్రపంచకప్ ట్వంటీ- 20 మ్యాచ్‌కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ధోనీ కూడా ధృవీకరించాడు.

ఐర్లాండ్‌తో జరిగే రెండో మ్యాచ్‌కు కూడా అతను అందుబాటులో ఉండకపోవచ్చని తెలిపాడు. జహీర్ ఖాన్ బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. అతని ప్రదర్శన సంతృప్తికరంగా ఉంది. అయితే తాము రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదని ధోనీ పేర్కొన్నాడు. తాజా మ్యాచ్‌లో రోహిత్ శర్మ, ఇశాంత్ శర్మలు బాగా ఆకట్టుకున్నారని ప్రశంసించాడు.

వెబ్దునియా పై చదవండి