ఐసీసీ ట్వంటీ- 20 ఛాంపియన్‌షిప్‌లో ఐపీఎల్ అనుభవం ఉపయోగపడుతుందని దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. తమ జట్టుకు ట్వంటీ- 20 మ్యాచ్‌లు ఆడిన అనుభవం పెద్దగా లేకపోవడంతో, ఇటీవల ఐపీఎల్ టోర్నీ అనుభవాన్ని తాజా టోర్నీలో సానుకూలంగా మార్చుకోవాలని స్మిత్ భావిస్తున్నాడు. ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ జూన్ 5న ప్రారంభం కానుంది.
జట్టులోని అనేక మంది అంతర్జాతీయ క్రికెటర్లకు అంతర్జాతీయ ట్వంటీ- 20 క్రికెట్ పెద్దగా ఆడలేదు. ఇటీవల జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందర్భంగా ఆడిన 14 మ్యాచ్‌లతో సాధించిన అనుభవం ఇక్కడ ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ అనుభవంతో కొత్త ఆలోచనలు చేసేందుకు, ప్రణాళికలు తయారు చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నాడు.
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఆడిన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జాక్వస్ కలీస్‌పై స్మిత్ ఆశలు పెట్టుకున్నాడు. కలీస్ ఐపీఎల్‌లో విజయవంతమవడంతో, అతను ఈ ఫామ్‌ను ప్రపంచకప్‌లోనూ కొనసాగిస్తాడని స్మిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కలీస్ ఐపీఎల్‌లో బాగా ఆడాడు. తాజా టోర్నీలోనూ అతను పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతాడని పేర్కొన్నాడు.