రాజకీయాల్లో ఓడలు బండ్లు అవుతాయి... బండ్లు ఓడలు అవుతాయి అన్నది నానుడి. ఇది తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది. ఒకప్పుడు ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని జైలుకెళ్ళారు. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. జైలు నుంచి విడుదలయ్యాక ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పీసీసీ పగ్గాలు చేపట్టారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఏకంగా పార్టీని విజయపథంలో నడిపించారు. తదుపరి సీఎం కూడా ఆయనే అంటున్నారు. ఇది రేవంత్ రెడ్డికి పక్కా సరిపోతుంది.
కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని భావోద్వేగపూరితమైన హామీ ఇచ్చారు. ఈ గడ్డపై ప్రతి బిడ్డ బ్రతుకులో వెలుగు నింపే బాధ్యత తీసుకుంటానని, దేశానికి కొడంగల్‌ను ఒక మోడల్‌గా తీర్చిదిద్దుతానని రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు.
మరోవైపు, కాంగ్రెస్ పార్టీ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితమిస్తున్నట్టు ప్రకటించారు. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను అమలు చేయడానికి ఈ తీర్పు ద్వారా కాంగ్రెస్ పార్టీ బాధ్యతను మరింత పెంచారు. ఈ డిసెంబరు 3న తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు. భారత్ జోడో యాత్ర తెలంగాణలో 21 రోజుల పాటు సాగింది. రాష్ట్ర ప్రజలకు ఏ కష్టమొచ్చిన అండగా ఉంటామని రాహుల్‌గాంధీ భరోసా ఇచ్చారు. తనను, భట్టి విక్రమార్కను రాహుల్ ఎంతో ప్రోత్సహించారు.
సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలకు తెలంగాణతో కుటుంబ అనుబంధం ఉంది. పార్టీ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, హనుమంతరావు తదితర నేతల సహకారంతోనే కాంగ్రెస్ విజయం సాధించింది. ఆచార్య కోదండరామ్ సలహాలు, సూచనలు తీసుకుని ముందకెళ్తాం. కాంగ్రెస్ గెలుపును ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్ గెలుపును కేటీఆర్ స్వాగతించారు. వారి స్పందనను స్వాగతిస్తున్నా. ప్రతిపక్ష పార్టీగా భారాస సహకరిస్తుందని ఆశిస్తున్నా. ఇక నుంచి ప్రగతి భవన్.. ప్రజా భవన్ అవుతుంది అని రేవంత్ రెడ్డి తెలిపారు.