మినీ సార్వత్రిక సమరం : ఓట్ల లెక్కింపు ప్రారంభం - కాంగ్రెస్ ఆధిక్యం

ఆదివారం, 3 డిశెంబరు 2023 (08:30 IST)
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. గత నెల రోజులుగా ఉత్కంఠ రేపిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో ఓట్లను లెక్కిస్తున్నారు. తెలంగాణలోని మొత్తం 49 కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ను మొదలుపెట్టారు. తొలుత పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తున్నారు.
 
రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులతో పాటు కేంద్ర సర్వీసుల్లో ఉన్నవారు, దివ్యాంగులు, 80 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు తదితరులు సుమారు 2.20 లక్షల మంది వేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లతో కౌంటింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 8.30 గంటల తర్వాత ఈవీఎంలోని ఓట్లను లెక్కిస్తారు. 
 
భద్రాచలం, అశ్వారావుపేట, చార్మినార్‌ నియోజకవర్గాల్లో లెక్కింపు రౌండ్లు తక్కువగా ఉండడంతో వీటిలో ఏదో ఒక స్థానం ఫలితం తొలుత వెలువడవచ్చని అంచనా. చార్మినార్‌లో పోలైన ఓట్లు అతి తక్కువగా ఉన్నందున మిగిలిన రెండింటి కంటే దాని ఫలితమే మొదట తెలుస్తుందని భావిస్తున్నారు. 10 గంటల నుంచి ఫలితాల సరళి వెలువడే అవకాశం ఉంది. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 25 సీట్ల ఆధిక్యంతో దూసుకెళుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు