నర్సన్నా నీకు అన్నీ బాగా గుర్తున్నాయే.. మోత్కుపల్లితో కేసీఆర్ పరాచకాలు

శనివారం, 11 మార్చి 2017 (07:35 IST)
శుక్రవారం సాయంత్రం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ కాగానే మోత్కుపల్లి కూడా టీడీపీలోంచి జంప్ అంటూ వార్తల మీద వార్తలతో సోషల్ మీడియా వైరల్ అయింది. కాని అసలు విషయం ఏమిటంటే వారిద్దరి మధ్య పార్టీ మార్పిడుల గురించిన చర్చ కాదనీ తన కుమార్తె వివాహ సందర్భంగా ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి మోత్కుపల్లి వెళ్లారని తెలుస్తోంది. పైగా ఇద్దరిమధ్య గంటసేపు పాత జ్ఞాపకాలతో పరామర్శలు, పరాచికాలు జరిగాయట. విషయంలోకి వస్తే..
 
తెలంగామ ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు... తెలుగుదేశం పార్టీలో చాలా కాలం కలిసి పనిచేసిన ఈ ఇద్దరు నేతలు శుక్రవారం ఇక్కడ సుమారు గంటపాటు భేటీ అయ్యారు. స్మృతులు నెమరు వేసుకొన్నారు. నర్సింహులు ఏకైక కుమార్తె డాక్టర్‌ నీహారిక వివాహం ఈ నెల 15వ తేదీన హైదరాబాద్‌లో జరగనుంది. ఈ వేడుకకు ఆహ్వానించడానికి ఆయన శుక్రవారం సీఎం కేసీఆర్‌ నివాసానికి వెళ్లారు. ఇద్దరూ రాజకీయ భేదభావాలు పక్కన పెట్టి మాట్లాడుకొన్నారు.
 
పెళ్లికి తప్పక రావాలని మోత్కుపల్లి కోరగా.. వస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. చాలాకాలం తర్వాత వారు కలవడంతో పాత విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టడంతో కొత్త తరానికి ప్రాధాన్యం ఇవ్వడంతో తెలంగాణలో ఎంతో మందికి రాజకీయ రంగంలో ప్రవేశానికి అవకాశం దొరికిందని, మనందరం ఈ స్థాయికి ఎదిగామని మోత్కుపల్లి అన్నారు. దానిని కేసీఆర్‌ అంగీకరించారు. ‘ఎన్టీఆర్‌ గొప్ప నేత. అది కాదనలేని సత్యం’ అన్నారు. 
 
రాష్ట్రంలో రిక్షా తొక్కేవారందరికీ రెండు జతల డ్రస్సులు ఇవ్వాలని తామిద్దరం కలిసి ఎన్టీఆర్‌ వద్దకు వెళ్లి అడగగానే ఆయన అంగీకరించిన విషయాన్ని మోత్కుపల్లి గుర్తు చేసినప్పుడు కేసీఆర్‌ నవ్వుతూ ‘నర్సన్నా నీకు అన్నీ బాగా గుర్తున్నాయే’ అన్నారు. 
 
ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తావన కూడా వారి మధ్య వచ్చింది. ఉద్యమ సమయంలో పరస్పర విమర్శలు చేసుకొన్నా తనకు చంద్రబాబు అంటే వ్యతిరేక భావమేమీ లేదని కేసీఆర్‌ అన్నారు. మోత్కుపల్లికి గవర్నర్‌ పదవి ఎంతవరకూ వచ్చిందని కేసీఆర్‌ ఆరా తీశారు. ‘అంతా భగవంతుడి దయ. మా సారు ప్రయత్నం చేస్తున్నారు. ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది’ అని మోత్కుపల్లి బదులిచ్చారు.
 

వెబ్దునియా పై చదవండి