రంగారెడ్డి జిల్లా జల్‌పల్లిలోని తన నివాసం వద్ద జరిగిన ఘటనపై సీనియర్ నటుడు మోహన్ బాబు మరోమారు స్పందించారు. తాను ఉద్దేశపూర్వకంగా మీడియా ప్రతినిధిని కొట్టలేదని వివరణ ఇచ్చారు. జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పారు. ఆదివారం సాయంత్రం సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వెళ్లిన ఆయన.. తాను దాడి చేయడం వల్ల తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మీడియా ప్రతినిధి రంజిత్ కుమార్‌ను పరామర్శించారు. ఆ సమయంలో తన పెద్ద కుమారుడు మంచు విష్ణు కూడా ఉన్నారు. ఈ సందర్బంగా రంజిత్ కుటుంబ సభ్యులకు ఆయన క్షమాపణలు చెప్పారు. అలాగే, రంజిత్ కుమార్‌తో మాట్లాడి సారీ చెప్పారు. చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత రిపోర్టర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఆ రోజు తన నివాసంలో జరిగిన ఘటన పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.
కాగా, తమ కుటుంబ ఆస్తుల వివాదం చెలరేగగా, ఈ క్రమంలో తన నివాసంలో ప్రవేశించిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు ఉగ్రరూపం ప్రదర్శించి దాడి చేసిన విషయం తెల్సిందే. ఈ దాడిలో టీవీ9 చానల్ రిపోర్టర్ రంజిత్ కుమార్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో మోహన్ బాబుబై హత్యాయత్న కేసు నమోదు కాగా, ఈ కేసులో అరెస్టు చేయకుండా ఉండేందుకు ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తన కుమారుడుతో కలిసి ఆస్పత్రికి చేరుకున్న మోహన్ బాబు.. బాధితుడుకి, బాధిత కుటుంబానికి సారీ చెప్పారు.