తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో ఆయన భోజనం చేశారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు భద్రాచలంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సీతారాముల స్వామివారికి ఆయన పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
పవన్ కళ్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు
మరోవైపు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భద్రాచలం పర్యటనను రద్దు చేసుకున్నారు. శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని ఆయన సీతారాముల కళ్యాణానికి హాజరుకావాల్సివుంది. ఇందుకోసం ఆయన హైదరాబాద్ నగరంలోని నివాసం నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం 5 గంటలకు భద్రాచలం చేరుకోవాల్సివుంది. రాత్రి భద్రాచలం బస చేసి, సోమవారం సీతారాముల కళ్యాణానికి హాజరై, ఏపీ ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలను సమర్పించాల్సివుంది.
అయితే, పవన్ పర్యటన రద్దు అయినట్టు తెలంగాణ నిఘా విభాగం డీజీకి సమాచారం అందింది. తన పర్యటన వల్ల భక్తులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశ్యంతో పవన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ఈ నెల 11వ తేదీన ఒంటిమిట్ట కోదండరాముల వారి కళ్యాణోత్సవం జరుగనుంది. ఏపీ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు.