15 లక్షల కుటుంబాలకే రూ.500కే వంట గ్యాస్ కనెక్షన్లు!!

ఠాగూర్

గురువారం, 8 ఫిబ్రవరి 2024 (10:39 IST)
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీల్లో గృహలక్ష్మిపథకం కింద రూ.500కే వంట గ్యాస్ పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఇందులోభాగంగా, 15 లక్షల కుటుంబాలకు ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తుంది. అలాగే, 200 లోపు ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో అర్హుల ఎంపికపై అధికారులు దృష్టిసారించారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేలోగానే ఈ రెండింటిని అమలు చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 
 
ముఖ్యంగా, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 40 లక్షల వంటగ్యాస్ కనెక్షన్లు ఉండగా.. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 17.20 లక్షల కుటుంబాలకు మాత్రమే ఆహారభద్రతా కార్డులున్నాయి. గతంలో వీటినే తెల్లకార్డుగా వ్యవహరించేవారు. ఈ కార్డుదారుల్లో 15 లక్షలమందికే వంటగ్యాస్ కనెక్షన్లు ఉండగా.. వీరికే రూ.500కు సిలిండర్ లభించనుంది. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు 17.20 లక్షల మందికి దక్కే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. 
 
మరో పది రోజుల్లో ఖచ్చితమైన లెక్కలు వచ్చే అవకాశముందన్నారు. ఉచిత కరెంటుకు సంబంధించి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను క్షేత్రస్థాయిలో సీజీఎంలు, ఎస్ఈలు బుధవారం పరిశీలించారు. మెట్రోజోన్ సీజీఎం కె.నర్సింహస్వామి అంబేద్కర్ బస్తీలో, ఆర్ఆర్‌జోన్ సీజీఎం యాచారం, సీజీఎం సాయిబాబా మేడ్చల్ పరిధిలో ప్రక్రియలో పాల్గొని పర్యవేక్షించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు