హైదరాబాద్ నగరంలో విద్యుత్ కోతలు.. ఎప్పటి నుంచంటే...?

వరుణ్

మంగళవారం, 16 జనవరి 2024 (12:14 IST)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో విద్యుత్ కోతలు అమలు కానున్నాయి. విద్యుత్ కోతలకు దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్ఏపీడీసీఎల్) సిద్ధమవుతోంది. సంక్రాంతి తర్వాత విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందని ఆ సంస్థ ఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ సూచన ప్రాయంగా వెల్లడించారు. వార్షిక నిర్వహణ, మరమ్మతు పనుల్లో భాగంగా, ఈ కోతలను అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ విద్యుత్ కోతల వల్ల ప్రజలకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని, జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో పవర్ కట్స్ ఉంటాయని పేర్కొన్నారు.
 
మరోవైపు, రబీ సీజన్ డిమాండ్‌ను ఎదుర్కొనేందుకే వేసవి లేదా రబీ సీజన్‌లో ఉండే విద్యుత్ డిమాండ్‌కు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో రోజుకు రెండు గంటల కోతలు అవసరం పడొచ్చని తెలిపారు. సంక్రాంతి తర్వాత కోతలు ఉంటాయని స్పష్టం చేశారు. అయితే, నిర్వహణ పనులు జరిగే ప్రాంతాల్లో మాత్రమే పవర్ కట్స్ ఉంటాయని ఎక్స్ (ట్విట్టర్) వినియోగదారుల ప్రశ్నలకు బదులిస్తూ పేర్కొన్నారు.
 
మెయింటెనెన్స్ పనుల్లో భాగంగా విద్యుత్ తీగలపైకి పెరిగిన చెట్లకొమ్మలు తొలగించడం, విద్యుత్ లైన్లను సరిచూసుకోవడం, అవసరమైతే కొత్తవాటిని వేయడం వంటివి ఉంటాయని ముషారఫ్ తెలిపారు. విద్యుత్ కోతలు ఉంటాయని చెప్పినంత మాత్రం రోజువారీ ఉండవని, ఒక్కో ఫీడర్ ఒక్కో రోజు మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. 
 
జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 3 వేల ఫీడర్లు ఉన్నాయని, ఆయా ఫీడర్ల పరిధిలో రెండు గంటల కోతలు ఉంటాయని తెలిపారు. సమ్మర్ డిమాండు తట్టుకునేందుకు ప్రతి సంవత్సరం నవంబర్-జనవరి మధ్య వార్షిక నిర్వహణ పనులు ఉంటాయని, కానీ ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఇవి ఆలస్యమైనట్టు ఫారూఖీ వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు