డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేవరకు నరికి చంపుతా!!

ఠాగూర్

శనివారం, 12 ఏప్రియల్ 2025 (12:27 IST)
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, సినీ నటి విజయశాంతి భర్త శ్రీనివాస్‌కు ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. తనకు డబ్బులు ఇవ్వకుంటే కసితీరా నరికి చంపుతానంటూ బెదిరించాడు. దీంతో ఆయన బంజారా హిల్స్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, విజయశాంతి భర్త ఎంవీ శ్రీనివాస ప్రసాద్‌కి నాలుగేళ్ళ క్రితం ఎం.చంద్రకిరణ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తానని చెప్పడంతో పనితీరు చూశాక కాంట్రాక్ట్ ఇస్తామని శ్రీనివాస ప్రసాద్ హామీ ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత అనుకున్న ఫలితాలు రాకపోవడంతో చంద్రకిరణ్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకోకుండా పంపించేశాడు. 
 
అయితే, చంద్రకిరణ్ మాత్రం తాను విజయశాంతి వద్ద పనిచేస్తున్నానని చెప్పి పలువురు రాజకీయ నేతల వద్ద కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో తనకు డబ్బులు ఎపుడు ఇస్తారని శ్రీనివాస ప్రసాద్‌కు నిందితుడు మెసేజ్ పెట్టాడు. ఒప్పందం జరగకున్నా డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించిన విజయశాంతి భర్త... ఇంటికి వచ్చి మాట్లాడాలని సూచించారు. 
 
ఆ తర్వాత ఇంటికి రాలేదు సరికదా, తనకు డబ్బులు ఇవ్వకపోతే మీ బతుకులను రోడ్డున పడేస్తానని, కసి తీరేవరకు దారుణంగా చంపుతానని బెదిరిస్తూ మేసేజ్ పెట్టాడు. దీంతో శ్రీనివాస ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు