వారం రోజుల్లో వివాహం.. అంతలోనే అనుకోని విషాదం...

ఠాగూర్

ఆదివారం, 11 ఆగస్టు 2024 (10:31 IST)
వారం రోజుల్లో వివాహం జరగాల్సివుంది. కానీ, అంతలోనే అనుకోని విషాదం నెలకొంది. నిద్రపోయిన యువకుడు రాత్రికి రాత్రే తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడు. ఈ విషాదకర ఘటన నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు ప్రకారం, గ్రామానికి చెందిన కంచుగట్ల శంకరయ్య, పద్మలకు ఒక్కగానొక్క కుమారుడు కంచుగట్ల శివ (25). తల్లిదండ్రులతోనే ఉంటూ పొలం పనులు చూసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ నెల 18న వారి బంధువుల అమ్మాయితో శివకు వివాహం చేయాలని అతడి తల్లిదండ్రులు నిర్ణయించారు. 
 
శనివారం పెళ్లి దుస్తులు కొనుగోలు చేయాలని, ఉదయాన్నే కుమారుడిని నిద్రలేపేందుకు ప్రయత్నించగా లేవలేదు. కుటుంబసభ్యులు, చుట్టుపక్కల వారు వచ్చి చూసినా ఫలితం లేకపోవటంతో చనిపోయినట్లు నిర్ధారించుకున్నారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందటంతో శివ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. శనివారం సాయంత్రం అతని అంత్యక్రియలను నిర్వహించారు. కాగా శివ మృతికి గల కారణాలు తెలియరాలేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు