నిద్రలోనే కాటేసిన మృత్యువు... భారీ వర్షానికి పాత ఇంటి గోడ కూలి...

ఠాగూర్

మంగళవారం, 23 సెప్టెంబరు 2025 (12:52 IST)
నిజామాబాద్ జిల్లాలో విషాదకర ఘటన ఒకటి చోటుచేసుకుంది. భారీ వర్షానికి పాత ఇంటి గోడ ఒకటి కూలిపోయింది. ఈ ప్రమాదలో గాఢ నిద్రలో ఉన్న తండ్రి, నెలన్నర పాప అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడుని మహేశ్ (24)గా గుర్తించారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాదకర ఛాయలు అలముకున్నాయి.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కోటగిరికి చెందిన మహేశ్ (24) తన భార్య, నెలన్నర పసికందుతో కలిసి తమ ఇంట్లో నిద్రిస్తున్నారు. సోమవారం రాత్రి ఆ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి పాత ఇంటి గోడ ఒకటి కూలిపోయింది. ఈ గోడ శిథిలాలు గాఢ నిద్రలో ఉన్న మహేశ్‌, అతని కుమార్తెపై విరిగి పడటంతో వారిద్దరూ అక్కడికక్కడే తుదిశ్వాస విడిచారు. 
 
ఈ ప్రమాదంలో మహేశ్ భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద శబ్దం విని చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న ఆమెను బయటకు తీసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు