రూ.6 కోట్ల మోసం కేసులో శ్రవణ్ రావు అరెస్టు!!

ఠాగూర్

మంగళవారం, 13 మే 2025 (22:28 IST)
సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రవణ్ రావు తాజాగా మరో కేసులో అరెస్టయ్యాడు. ఓ చీటింగ్ కేసుకు సంబంధించి సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు మంగళవారం అతనిని అదుపులోకి తీసుకున్నారు. 
 
గతంలో అఖండ ఎంటర్‌ప్రైజెస్ అనే సంస్థకు శ్రవణ్ రావు 6.58 కోట్ల రూపాయలు మేర నష్టం కలిగించారని, మోసానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బాధితులను సీపీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న అధికారులు, విచారణ నిమిత్తం హాజరుకావాల్సిందిగా శ్రవణ్ రావుకు నోటీసులు జారీచేశారు. 
 
దీంతో మంగళవారం నాడు శ్రవణ్ రావు సీసీఎస్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సుధీర్ఘ విచారణ అనంతరం, ఆయనను అరెస్టు చేసినట్టు పోలీస్ వర్గాలు ప్రకటించాయి. శ్రవణ్ రావును నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు పోలీసులు తరలించారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రవణ్ రావు, ఇపుడు చీటింగ్ కేసులో అరెస్టు కావడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు