సినిమా టికెట్ల ధరలు, ప్రత్యేక ప్రదర్శనలపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ జరిగింది. ప్రత్యేక ప్రదర్శనల అనుమతిపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. బెన్ఫిట్ షోలను రద్దు చేశామని చెప్పిన ప్రభుత్వం పరోక్షంగా ప్రత్యేక షోల ప్రదర్శనుకు అనుమతి ఏంటని ప్రశ్నించింది. అర్థరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత తెల్లవారుజామున షోలకు అనుమతి ఇవ్వడంపై పునసమక్షించాలని హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.
అత్యంత ప్రజాదరణ కలిగిన సినిమాలకు వేళకాని వేళలో ప్రదర్శనకు అనుమతినివ్వడం, ఒక షోకు, మరో షోకు మధ్య 15 నిమిషాల సమయం మాత్రమే ఉండటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదంటూనే రాంచరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమాకు అదనపు షోలు, టికెట్ల రేట్ల పెంపునకు అనుమతినివ్వడంపై హైకోర్టులో లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్లు దాఖలయ్యాయి.
తెల్లవారుజామున నాలుగు గంటల షోకు అనుమతినివ్వడం, లైసెన్సింగ్ అథారిటీలు కాకుండా హోంశాఖ ముఖ్యకార్యదర్శి మెమో జారీ చేయడం, టికెట్ల రేట్ల పెంపునకు అంగీకరించడం సరికాదని ఈ సందర్భంగా పిటిషనర్లు వాదించారు. 'పుష్ప-2' సినిమా ఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించారు. షోల మధ్య తగినంత వ్యవధి లేకపోవడంతో సినిమాకు వచ్చే జనాలను అదుపు చేయడం కష్టంగా మారుతుందన్నారు. వాదనలు విన్న జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
తెల్లవారుజామున 4 గంటల సమయంలో ప్రదర్శించే సినిమాకు 16 ఏళ్లలోపు పిల్లలు వెళ్తే వారి పరిస్థితి ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. 16 ఏళ్లలోపు పిల్లలను రాత్రివేళ సినిమాలకు రానివ్వకుండా అడ్డుకోవాలని పేర్కొంది. ఇది వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని తెలిపింది. అంతేకాదు, రాత్రివేళ భారీగా వచ్చే జనాన్ని అదుపు చేసే విషయంలో పోలీసులపై అదనపు భారం పడుతుందని పేర్కొంది.
ప్రదర్శనకు, ప్రదర్శనకు మధ్య 15 నిమిషాలు మాత్రమే వ్యవధి ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్న ఆ కొద్దిపాటి సమయంలో వందలమంది వాహనాలను తీసుకెళ్లడం, వచ్చేవారు పార్క్ చేయడం ఎలా కుదురుతుందని ప్రశ్నించింది. ప్రస్తుతం దాఖలైన పిటిషన్లకు ప్రజాప్రయోజన వ్యాజ్య స్వభావం ఉందని, అదనపు షోలు, బెనిఫిట్ షోలు, రేట్ల పెంపుపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తే బాగుంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది.