టీజీ అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష : సీఎం రేవంత్

వరుణ్

సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (13:07 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లపై "టీజీ" అనే అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు, వాహనాల రిజిస్ట్రేషన్‌ కోడ్‌ను టీజీగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. 
 
'ఒక జాతి అస్తిత్వానికి చిరునామా భాష, సాంస్కృతిక వారసత్వమే. దాన్ని సమున్నతంగా నిలబెట్టాలనే సదుద్దేశంతోనే "జయ జయహే తెలంగాణ"ను అధికారిక గీతంగా, సగటు రాష్ట్ర ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా, రాచరికపోకడలు లేని చిహ్నమే రాష్ట్ర అధికారిక చిహ్నంగా, వాహన రిజిస్ట్రేషన్లలో టీఎస్ బదులు ఉద్యమ సమయంలో ప్రజలు నినదించిన టీజీ అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష. దాన్ని నెరవేరుస్తూ రాష్ట్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం" అని పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు