వాట్సాప్ వీడియో కాల్ వైద్యం వికటించింది. ఫలితంగా గర్భంలోనే కవల పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో చోటుచేసుకుంది. పెళ్లయిన ఏడేళ్ల తర్వాత సంతానం కలగబోతుందని తెగ సంతోషపడిన ఆ దంపతులకు గర్భశోకమే మిగిలింది. ఆస్పత్రికి వచ్చిన గర్భిణికి వైద్యం చేయాలని నర్సుకు మరెక్కడో ఉన్న వైద్యురాలు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా సూచించింది. వైద్యులురాలు చెప్పినట్టుగానే నర్సు వైద్యం చేసింది. కానీ అది వికటించి ప్రాణాలు కోల్పోయింది.
ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేడు గ్రామానికి చెందిన బుట్టి గణేశ్, కీర్తిలకు ఏడేళ్ల కిందట వివాహం జరిగినా సంతానం కలగకపోడంతో ఇబ్రీహంపట్నంలోని విజయలక్ష్మి ఆస్పత్రిలో డాక్టర్ అనూషా రెడ్డి వద్ద వైద్యం ఆ దంపతులు వైద్యం చేయించుకున్నారు. ఈ క్రమంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న కీర్తికి నొప్పులు రావడంతో అదే ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. ఆ సమయంలో వైద్యురాలు అందుబాటులో లేకపోవడంతో డాక్టర్ వాట్సాప్ వీడియో కాల్ ద్వారా చేసిన సూచనల మేరకు గర్భిణికి ఇంజెక్షన్లు ఇచ్చి చికిత్స చేశారు. దీంతో వైద్యం వికటించి గర్భంలో ఉన్న ఇద్దరు కవల పిల్లలు మృతి చెందారు.
ఆ తర్వాత చికిత్సకు రూ.30 వేలు చెల్లించాలని బాధితులను ఆస్పత్రి యాజమాన్యం డిమాండ్ చేశారు. అయితే, మీ నిర్లక్ష్యం వల్లే శిశువులు చనిపోయారని, పైగా, తమ వద్ద డబ్బులు లేవని తాము చెల్లించలేమనని పేర్కొంటూ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఇప్పటికే సంతానం కోసం రూ.15 లక్షల వరకు ఖర్చు చేశామని, కవల పిల్లలు పుడుతున్నారని తెలిసి ఆనందపడ్డామని కానీ, ఇలా వైద్యురాలి నిర్లక్ష్యంతో ఈ దారుణం జరిగిందని వారు బోరున విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న జిల్లా వైద్యాశాఖ అధికారి వెంకటేశ్వర రావు ఆస్పత్రిని పరిశీలించి సీజ్ చేశారు.