తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలే వర్షాలు కురువనున్నాయి. ఈ విషయాన్ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని, అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీచేసినట్టు అధికారులు వెల్లడించారు.
వాతావరణ కేంద్రం విడుదల చేసిన వివరాల మేరకు, మంగళవారం, బుధవారం రాష్ట్రంలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే, గురు, శుక్రవారాల్లో వర్ష తీవ్ర పెరగనుందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, పాలమూరు, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
అదేసమయంలో జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబ్ నగర్, భద్రాద్రి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఈ జిల్లాలతో పాటు రాజధాని నగరం హైదరాబాద్‌లో కూడా వర్షం కురిసే అవకాశం ఉంని వారు పేర్కొన్నారు.