గూఢచర్యం కేసులో సమీర్ అరెస్టు.. ఇంతకీ ఎవరీ సమీర్!!

ఠాగూర్

మంగళవారం, 20 మే 2025 (14:30 IST)
గూఢచర్యం కేసులో హైదరాబాద్ నగరానికి చెందిన సమీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అతను ఉండే ఏరియా ప్రజలు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. సమీర్ నేపథ్యం, ఇతర వివరాలను పరిశీలిస్తే, 
 
బోయగూడ రైల్ కళారంగ బస్తీలో సమీర్ కుటుంబం నివాసముంటోంది. చిన్నప్పుడే ఇతని తండ్రి మరణించటంతో తన తల్లి, సోదరితో కలసి ఉంటున్నాడు. లిఫ్ట్ మెకానిక్‌గాను, సోదరి సీసీటీవీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. 
 
ఈ క్రమంలో కొంతకాలంగా సమీర్ ఇంటికి కొందరు యువకులు వచ్చిపోతుండేవారని, అర్థరాత్రి దాటాక వారితో సమావేశాలు నిర్వహించినట్లు గుర్తించామని బస్తీ యువకుడొకరు తెలిపారు. మోసం కేసులో కొందరితో కలసి లావాదేవీలు నిర్వహించినట్టు ఫిర్యాదు వచ్చిందని పోలీసులు చెప్పారని సమీర్ సోదరి మీడియాకు వెల్లడించారు. 
 
ఆయన సామాజిక మాధ్యమాల్లో కొన్ని గ్రూపులు నిర్వహించేవాడని, యువకులను సభ్యులుగా చేసుకొని సేవా కార్యక్రమాలు చేపట్టేవాడన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లోని గ్రూపుల్లో సభ్యులున్న మాట నిజమేనని పేదలకు సహాయం చేసేందుకు మాత్రమే దాన్ని ఉపయోగించేవాడని వివరించారు. సమీర్ ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులుగా ఉన్న వారిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన యువకులే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
 
కాగా, హైదరాబాద్ నగరంలో గతంలోనూ ఉగ్రజాడలు ఆందోళన కలిగించాయి. 2022లో దసరా పండుగనాడు భారీ పేలుళ్లకు కుట్రపన్నిన నగరానికి చెందిన ఉగ్రవాదులు అబ్దుల్లాహెద్, మహ్మద్ సమీయుద్దీన్, మాజాసన్ ఫరూఖ్లను నగర సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ జనసమ్మర్దం ఉండే ప్రాంతాల్లో గ్రనేడ్లు విసిరి మారణహోమం సృష్టించేందుకు పథకం వేశారు. దీనికి అవసరమైన గ్రనేడ్లను పాకిస్థాన్ నుంచి తీసుకొచ్చారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో బాంబుపేలుళ్లు ప్రధాన సూత్రధారి వికారుద్దీన్.. ఉగ్రవాద కార్యకలాపాలకు ముఠా ఏర్పాటు చేసుకొని కలకలం సృష్టించాడు. ఇతడిని పోలీసులు 2010 జులైలో సీతాఫలండిలో అరెస్ట్ చేశారు. అనంతరం 2015లో న్యాయస్థానానికి తీసుకొస్తుండగా అతడు పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించి ఎదురుకాల్పుల్లో ముఠాతో సహా మరణించాడు. తాజాగా సీతాఫల్మండి ప్రాంతంలో చీకటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడనే అనుమానంతో ఒక యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. గతంలో టోలిచౌకి, లంగర్ హౌస్, పాతబస్తీ ప్రాంతాల్లో పలుమార్లు ఉగ్ర కార్యకలాపాలకు సహకరిస్తున్న సానుభూతిపరులను అరెస్ట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు