సాధారణంగా రైలు కదిలినపుడు ఎక్కేందుకు ప్రయత్నించే ప్రయాణికులు కిందపడిపోతుంటారు. అలాగే, మరికొందరు రైలు వేగంగా ప్రయాణించే సమయంలో నిద్రమత్తులో జోగుతూ కిందపడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా వేగంగా వెళుతున్న రైలు నుంచి ఆరేళ్ళ చిన్నారి కిందపిడింది. అదృష్టవశాత్తు ఈ చిన్నారి గాయాలతో బయటపడింది. ఈ ఘటన తెలంగాణలోని పెద్దపల్లి స్టేషన్ సమీపంలో జరిగింది.
శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో గొల్లపల్లి శివారులో రెండు రైల్వే ట్రాకుల మధ్యన రాళ్లపై పడిన చిన్నారి ఏడుపు విన్న స్థానికులు వెంటనే సమీపంలోని రైల్వే గేట్‌మన్, బసంత్‌నగర్ పోలీసులకు సమాచారం అందించి చిన్నారిని అంబులెన్స్‌లో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు చిన్నారి ఉదయం 6 గంటలకు రైలు నుంచి కిందపడిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఎటువైపు వెళ్లే రైలు నుంచి చిన్నారి పడిపోయి ఉంటుందన్న విషయంలో స్పష్టత లేకపోవడం, పాప మాట్లాడలేకపోతుండడంతో ఆమె వివరాలు తెలియరావడం లేదని పోలీసులు తెలిపారు.
చిన్నారి ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడిందా? లేక, కుటుంబ సభ్యులే ఆమెను రైలు నుంచి తోసివేసి ఉంటారా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇంతకీ ఈ చిన్నారికి తల్లిదండ్రులు ఉన్నారా? లేక అనాథనా? అనే కోణంలో కూడా విచారిస్తున్నారు.