నెట్‌క్యాష్ శంకరయ్య - ఆ సీఐ ఆస్తుల విలువ రూ.5 కోట్లు
బుధవారం, 15 జులై 2020 (19:26 IST)
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఓ భూ వివాదంలో రూ.1.2 లక్షల నెట్‌క్యాష్ తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (అనిశా)కు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన సీఐ శంకరయ్య కూడబెట్టిన ఆస్తుల చిట్టా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. ఇప్పటికి ఆయన రూ.4.5 కోట్ల విలువ చేసే ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారుల దర్యాప్తులో వెలుగు చూసింది. ఇక్కడ గమనించాల్సి విషయం ఒకటుంది. ఆయన ఇప్పటివరకు జరిపిన అన్ని రకాల ట్రాన్సాక్షన్స్.. కేవలం నగదు రూపంలోనే నిర్వహించాడు. అందుకే ఆయనకు నెట్‌క్యాష్ శంకరయ్య అని పేరుబడింది.
ఈ నెట్‌క్యాష్ శంకరయ్య అవినీతి చరిత్రను పరిశీలిస్తే, హైదరాబాద్ శివార్లోని ఓ ఖరీదైన ప్రాంతంలో విల్లా కొనుగోలు చేసేందుకు అడ్వాన్సుగా శంకరయ్య రూ.1.1 కోట్లు నెట్‌క్యాష్ రూపంలో చెల్లించారు.
ఇక వనస్థలిపురంలో 260 గజాల్లో నిర్మించిన జీ ప్లస్ టూ, పెంట్‌హౌస్ కోసం అవసరమైన డబ్బును కూడా ఆయన నెట్‌క్యాష్‌గానే చెల్లించారు. అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఆయనకు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.
ఓ సీఐగా పని చేస్తున్న శంకరయ్య, ఇప్పటికే స్టోన్ క్రషర్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారు. వేర్వేరు స్టోన్ క్రషర్స్‌లో రూ.కోటి దాకా పెట్టుబడులు పెట్టారు. ఈ మొత్తం కూడా కేవలం నగదు రూపంలోనే చెల్లించినట్టు గుర్తించారు.
ఆయనకు మొత్తం ఆరు బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఇప్పటికే ఖాతా లావాదేవీల వివరాలు అందజేయాల్సిందిగా ఆయా బ్యాంకులకు లేఖలు రాశారు.
దరాబాద్‌లోని ఓ బ్యాంకుతోపాటు ఆయన గతంలో పనిచేసిన జిల్లాల్లో మరో ఐదు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. వీటన్నిటి నుంచి ఒకటి, రెండు రోజుల్లో ఏసీబీకి పూర్తి సమాచారం అందనుంది.
కాగా భూ వివాదంలో రూ. 1.2 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డ శంకరయ్యపై ఏసీబీ ప్రస్తుతానికి ట్రాప్ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా తనిఖీలు చేపట్టగా కోట్ల రూపాయల ఆస్తుల వివరాలు బయటకు వచ్చాయి.
ఇదీ ఆస్తుల చిట్టా...
ట్రాప్ కేసులో పట్టుబడిన శంకరయ్యకు సంబంధించి ప్రాథమిక తనిఖీల్లో రూ.4.58 కోట్లు విలువైన స్థిర, చరాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. మార్కెట్ ధర ప్రకారం వీటి విలువ మరింత ఎక్కువగా ఉంటుందని సమాచారం.
రూ.1.5 కోట్లు విలువ చేసే రెండు ఇళ్లు, రూ.2.28 కోట్లు విలువైన 11 ఇళ్ల స్థలాలు, నిజామాబాద్ జిల్లా రెంజల్, చేవెళ్ల మండలం ముదిమ్యాల, మిర్యాలగూడలో 41 ఎకరాల 3 గుంటల వ్యవసాయ భూమి గుర్తించారు.
రూ.21.14 లక్షల బంగారు ఆభరణాలు, రూ.17.88 లక్షల నగదు, వెండి వస్తువులు, ఇతర విలువైన గృహోపకరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.