రాష్ట్ర ప్రభుత్వం నూతన మోటర్ వాహనాల చట్టం-2019 అమలు చేస్తూ జరిమానాలతో నిలువు దోపిడీ చేస్తోందని, నూతన చట్టంను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నేడు ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్స్ యూనియన్ ఐకాస రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజు బంద్‌కు పిలుపునిచ్చింది.
ఇంధన ధరలు పెరుగుదలతో క్యాబ్, ఆటోలకు గిట్టుబాటు కావటం లేదని, దీనికితోడు నూతన చట్టం పేరుతో ఎడాపెడా ఆటో, క్యాబ్ డ్రైవర్లకు జరిమానాలు విధిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వెంటనే నూతన మోటార్ వాహనాల చట్టం 2019ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఆటోలు, క్యాబ్, లారీల డ్రైవర్లు గురువారం బంద్ పాటిస్తున్న క్రమంలో ప్రజలు ఇబ్బంది పడకుండా గ్రేటర్ హైదరాబాద్‌లో ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బుధవారం అర్థరాత్రి నుంచే ముఖ్యమైన ప్రయాణికుల అవసరాల మేరకు ప్రత్యేక బస్సుల నడుపుతుంది.
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ప్రయాణీకులకు ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. పల్లెల్లకు రద్దీగా ఉండే రూట్లతో పాటు, జిల్లా కేంద్రాల్లో లోకల్ బస్సులు తిప్పేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు.