బాహుబలి దెబ్బకు అబ్బా అంటున్న టీ కాంగ్రెస్: అధిష్టానం వరకూ వెళ్లిన చిచ్చు
మంగళవారం, 21 మార్చి 2017 (08:07 IST)
దేశమంతా ఇప్పుడు బాహుబలి ఫీవరే. సినిమా పరంగానే కాదు. రాజకీయాల్లో కూడా బాహుబలి ప్రకంపనలు రేపుతూనే ఉంది. ప్రధాని మోదీ అంతటివాడే బాహుబలి సినిమాలో కట్టప్పలాగా సేవచేస్తా మాకే ఓటేయండి అని ఉత్తర ప్రదేశ్ ఓటర్లకు గాలం వేసి సీట్లు కొల్లగొట్టిన వైనం చూశాం. ఉత్తరాఖండ్‌లో అయితే మాజీ ముఖ్యమంత్రిని నేరుగా శివలింగాన్ని అవలీలగా ఎత్తిన బాహుబలి వేషం వేయించి ప్రచారంలో వాడుకున్నారు. ఇప్పుడు బాహుబలి తెలంగాణ కాంగ్రెస్ ఉట్టి ముంచుతోంది. అది పెట్టిన చిచ్చుకు టీ కాంగ్రెస్ నేతలు ఒకరిమీద ఒకరు ఫైర్ అవుతూనే ఉన్నారు. ఈ వివాదాన్ని ఎలా ముగించాలో బోధపడక షరామామూలుగా అధిష్టానానికే విన్నవిస్తాం అని రాగాలు పోతున్నారు.
విషయం ఏమిటంటే.. టీఆర్‌ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను ఓడించడానికి బాహుబలి వస్తాడని కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు కె.జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సద్దుమణిగినా ఆ పార్టీలో అంతర్గతంగా రగులుతున్నట్టుగానే కనిపిస్తోంది. టీఆర్‌ఎస్ బలంగా ఉన్నట్టు, కేసీఆర్‌ను ఓడించడానికి బయటనుంచి ఎవరో రావాలన్నట్టుగా జానారెడ్డి మాట్లాడారని పలువురు సీనియర్లు అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో అగ్రనేతగా, శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న జానా స్వయంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీ శ్రేణుల మనో స్థైర్యాన్ని దెబ్బతీయదా అని ప్రశ్నిస్తున్నారు.
‘తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కి, రాష్ట్ర ఏర్పాటు సమయంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చూపించిన పట్టుదల, చిత్తశుద్ధిపై తెలంగాణవాదుల్లో, ముఖ్యంగా యువతలో సానుకూల దృక్పథం ఉందని వారు అన్నారు. కాంగ్రెస్ పట్ల ఉన్న అనుకూలతను వచ్చే ఎన్నికల్లో వినియోగించుకుని, పార్టీకి పూర్వవైభ వం తీసుకురావాల్సిన బాధ్యత ఉన్న నాయకుడే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
‘పార్టీలో సమర్థులు లేరన్నట్టుగా, బయట పార్టీల నుంచి వస్తే తప్ప కాంగ్రెస్ పార్టీని కాపాడలేరని అన్నట్టుగా కీలక నాయకుడు మాట్లాడటం తప్పు డు సంకేతాలను పంపించదా’ అని పార్టీ సీనియర్ నాయకుడొకరు ప్రశ్నించారు. ‘శాసనసభలో కేసీఆర్‌ను ఎదిరించే బాహుబలి లేరేమోకానీ, టీపీసీసీలో చాలామంది బాహుబలిలు ఉన్నారు’ అని టీపీసీసీ ముఖ్య నాయకుడొకరు ఆగ్రహంగా వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ బయట బాహుబలి గురించి అసంబద్ధ వ్యాఖ్యలు చేసిన జానాపై చర్యలు తీసు కోవాలని పార్టీలోని కొందరు సీనియర్లు అధిష్టా నానికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. దీనిపై అధిష్టానం కూడా ఆరా తీస్తున్నట్టుగా టీపీసీసీ నాయకుడొకరు చెప్పారు. జానా వ్యాఖ్యలు.. దాని వెనుకనున్న ఉద్దేశమేమిటనేది అధిష్టానంలో ని ముఖ్యులు కొందరు ఆరా తీస్తున్నట్టుగా తెలిసింది.