ప్రపంచంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దీంతో కరోనా వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను కూడా పాటిస్తున్నారు. అలాగే, తమ పెంపుడు జంతువులకు కూడా ఇదేవిధంగా చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అమెరికాలోని ఓ జంతు ప్రదర్శనశాలలోని ఓ పులికి కరోనా వైరస్ సోకింది. దీంతో తమతమ ఇళ్లలో ఉండే పెంపుడు జంతువుల పట్ల కూడా యజమానులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామానికి చెందిన కాపరి కోటయ్య అనే వ్యక్తి మేకలే జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్నాడు. ఈయనకు కరోనా వైరస్ దెబ్బకు భయం పట్టుకుంది. మనుషులం మనమే జాగ్రత్త తీసుకోలేకుంటే ఈ మూగజీవాల పరిస్థతేంటి అనుకున్నాడో ఏమో. మేకల యజమానిగా వాటి బాధ్యత తానే తీసుకున్నాడు. మనుషులు ఉపయోగించే మాస్కులు మాదిరిగానే ప్రత్యేకంగా తయారు చేయించి 50 మేకలకు మాస్కులు తొడిగి మేపడానికి తీసుకెళ్లాడు.
ఇవి మేత మేసేటప్పుడు మినహా, ఇతర సమయాల్లో మాస్కులతో ముక్కు, నోటికి కప్పుతున్నాడు. మేకలు, గోర్లలో ఫ్లూ ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయాల్లో నిర్లక్ష్యంగా ఉంటే కరోనానే కాదు మరెన్నో పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటున్నారు. ప్రజలందరూ మాస్క్‌లు ధరించి.. కరోనా బారినపడకుండా కాపాడుకోవాలని సూచించాడు.