లాగ్ అవుట్ టైమింగ్‌లను మార్చుకోండి.. ఐటీ కంపెనీలకు సిఫార్సు

మంగళవారం, 25 జులై 2023 (22:56 IST)
తెలంగాణలో జూలై 26 నుండి జూలై 27 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో టెక్కీలకు సైబరాబాద్ పోలీసులు కీలక ఆదేశాలను జారీ చేశారు. హైదరాబాద్‌లోని సైబరాబాద్ పోలీసులు ఈ ప్రాంతంలోని ఐటీ కంపెనీలకు కీలకమైన సలహాను జారీ చేశారు. 
 
భారీ వర్షాల సమయంలో ట్రాఫిక్ రద్దీ  నివారించడానికి చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా ఐటీ కంపెనీలు ఉన్న నిర్దిష్ట ప్రాంతాల ఆధారంగా, వేర్వేరు లాగ్ అవుట్ టైమింగ్‌లను మార్చుకోవాలని పోలీసులు సిఫార్సు చేశారు. TCS, Dell, Oracle, Tech Mahindra వంటి ప్రముఖ ఐటీ సంస్థలతో పాటు Ikea నుండి సైబర్ టవర్స్ రోడ్‌లో ఉన్న కంపెనీలు మధ్యాహ్నం 3 గంటలకు లాగ్ అవుట్ అవ్వాలని సూచించడం జరిగింది. 
 
బయో డైవర్సిటీ, రాయదుర్గం ప్రాంతంలోని కంపెనీలకు, లాగ్ అవుట్ సమయం సాయంత్రం 4.30 గంటలుగా సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఇదిలా ఉండగా గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న కంపెనీలు, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజ సంస్థలు మధ్యాహ్నం 3 నుండి 6 గంటల మధ్య లాగ్ అవుట్ చేయాలని సూచించబడ్డాయి.
 
హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహిదీపట్నం, బేగంపేట వంటి వివిధ ప్రాంతాలు ఇటీవలి వర్షాల సమయంలో ట్రాఫిక్ కారణంగా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌లో ప్రజలు ఇబ్బంది పడకుండా వుండేందుకు టెక్కీలకు లాగ్ అవుట్ టైమింగ్‌లను మార్చుకోవాలని కోరారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు