డ్రగ్స్ కేసులో నటుడు సుబ్బరాజు ఇచ్చే సమాచారం చాలా కీలకంగా వున్నట్లు ఎక్సైజ్ అధికారులు చెపుతున్నారు. ఉదయం పదిన్నర గంటల నుంచి ఇంకా సుబ్బరాజును విచారిస్తూనే వున్నారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి మరింత సమాచారం సుబ్బరాజు నుంచి వస్తుందనీ, అందుకే కొద్దిసేపు ఆయనకు బ్రేక్ ఇచ్చి మళ్లీ విచారించనున్నామని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ వెల్లడించారు.
హైదరాబాదులోని కొన్ని బార్లు, పబ్ సెంటర్లు, హుక్కా సెంటర్లలో డ్రగ్స్ లభ్యమవుతున్నట్లు తాము విచారించిన వారు చెపుతున్నారనీ, అందువల్ల రేపు వారిని విచారిస్తామన్నారు. తమ దృష్టిలోకి ఇలాంటి 16 సెంటర్లు వున్నప్పటికీ అందరినీ పిలిచి విచారించనున్నట్లు తెలియజేశారు.
ఇక నటి ముమైత్ ఖాన్ కు ఈ నెల 27న తమ ముందు హాజరు కావాలని తెలియజేసినట్లు చెప్పారు. రేపు ఉదయం నటుడు తరుణ్ ను విచారిస్తామన్నారు. కేసు వివరాలను అడిగినప్పుడు... ఇప్పుడే వాటిని చెప్పలేమనీ, దర్యాప్తు మొత్తం పూర్తయిన తర్వాత వాటి వివరాలను వెల్లడిస్తామన్నారు. మరోవైపు ఇప్పటివరకూ విచారించినవారంతా పూరీ జగన్నాథ్‌కు సన్నిహితులు కావడంతో పూరీ కేంద్రంగా అన్ని జరిగాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.