అమితాసక్తిని నెలకొల్పిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఈ నెల 4వ తేదీన వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో అధికార తెరాస 56 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అదేసమయంలో బీజేపీ ఎవరూ ఊహించని విధంగా ఏకంగా 46 సీట్లను కైవసం చేసుకుని రెండో పార్టీగా నిలిచింది. ఇక పాతబస్తీలో తమకు తిరుగులేదని ఎంఐఎం మరోమారు నిరూపించింది. ఈ పార్టీకి 44 సీట్లు రాగా, కాంగ్రెస్ పార్టీకి కేవలం రెండు సీట్లు మాత్రమే వచ్చాయి.
ఈ క్రమంలో హైదరాబాద్ మేయర్ పీఠం దక్కాలంటే ఖచ్చితంగా 76 సీట్లు వచ్చివుండాలి. కానీ, ఇపుడు ఏ ఒక్క పార్టీకి అంతటిస్థాయిలో సీట్లు లేవు. దీంతో ఇటు తెరాస లేదా అటు బీజేపీలు మేయర్ కుర్చీకోసం పోటిపడితే ఖచ్చితంగా ఎంఐఎం మద్దతు తప్పనిసరి. అంటే ఇపుడు ఎంఐఎం కీలక పాత్ర పోషించనుంది.
ఈ క్రమంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఏకంగా మేయర్ కుర్చీపై కన్నేసినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో 'పార్టీలో చర్చించి మేయర్ పీఠంపై నిర్ణయం తీసుకుంటాం' అని పేర్కొనడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. చివరివరకు విషయాన్ని సాగదీయాలనే ఉద్దేశంతోనే ఆయన పార్టీలో చర్చిస్తామని చెప్పుకొచ్చారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
నిజానికి గత ఆరేళ్లుగా అధికార తెరాస, ఎంఐఎం మధ్య దోస్తీ కొనసాగుతున్నప్పటికి ప్రతి ఎన్నికల్లో స్నేహ పూర్వక పోటీ పేరుతో ఎవరికి వారు ఒంటరిగా బరిలో దిగుతూ వచ్చారు. ఈసారి కూడా ఎవరికి వారే పోటీకి దిగారు.
అయితే, తెరాస ఓ అడుగు ముందుకు వేసి మజ్లిస్‌తో దోస్తీ గీస్తీ లేదని, గత పర్యాయం ఐదు సీట్లలో ఓడగొట్టాం.. ఈ సారి పది డివిజన్లలో ఓడిస్తామని చెప్పింది. దానికి మజ్లిస్ ఘాటుగానే స్పందించింది. పరస్పర విమర్శలు కూడా తీవ్రస్థాయికి చేరడంతో ఆరేళ్ల బంధం కాస్త బెడిసినట్టయింది. ఈ నేపథ్యంలో తిరిగి దోస్తీ కోసం ఒకరికి ఒకరు సంప్రదించుకునేందుకు సంశయిస్తున్నట్లు తెలుస్తోంది.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పక్షాన 44 మంది అభ్యర్థులు విజయం సాధించగా, మరో 10 మంది ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు. దీంతో బల్దియాలో మజ్లిస్ సంఖ్యా బలం 54కి చేరింది. అయితే మేయర్ పీఠం సాధించేందుకు ఈ బలం సరిపోదు. అందువల్ల టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వడమా..? లేక టీఆర్‌ఎస్ సహకారం తీసుకోవడమా? అనే రెండు మార్గాలు మాత్రమే మజ్లిస్ ముందు ఉన్నాయి.
గతంలో కాంగ్రెస్ హయాంలో మాదిరిగా పాలనలో భాగస్వాములై రెండున్నరేళ్లు మేయర్ పదవి చేపట్టడమా... లేక బేషరతుగా మద్దతిచ్చి డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టడమా అన్న దానిపై తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వెంటనే నిర్ణయం వెలువరించకుండా... వేచి చూసే ధోరణి అవలంబించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.