మరో మూడు రోజులు బయటకు రావొద్దు.... 2 రోజులు సెలవులు
బుధవారం, 14 అక్టోబరు 2020 (12:45 IST)
తెలంగాణలో కురుస్తోన్న భారీ వర్షాల ధాటికి అనేక ప్రాంతాల్లో ఎక్కడికక్కడ వరదనీరు రోడ్లపై మోకాలిలోతు నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్ర వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కనీసం మూడు రోజులు నగరంలోని ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసర సేవల కోసం 040 - 211111111, జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణ శాఖ 90001 13667, 97046 01866 కు ఫోన్ చేయాలని చెప్పారు.
అలాగే, జీహెచ్‌ఎంసీ పరిధిలో చెట్లు తొలగించే సిబ్బంది కోసం 63090 62583, విద్యుత్ సమస్యలపై జీహెచ్‌ఎంసీ విద్యుత్ శాఖ 94408 13750, ఎన్‌డీఆర్‌ఎఫ్ సేవల కోసం 83330 68536, 040 2955 5500 నంబర్లకు ఫోన్ చేయొచ్చని తెలిపారు.
నిన్న పలు ప్రాంతాల్లో విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. చాలా సబ్‌స్టేషన్లలోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో ప్రజలు విద్యుత్ స్తంభాలు, తీగలు ముట్టుకోవద్దని సంబంధిత అధికారులు హెచ్చరిస్తున్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం 1912, 100కు లేక విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్ నంబర్లు 73820 72104, 73820 72106, 73820 7157కు ఫోన్ చేయొచ్చని తెలిపారు.
నేడు రేపు సెలవు
భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం అవుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు నేడు, రేపు సెలవు ప్రకటించింది.
మరో రెండుమూడు రోజులపాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
నిన్న కురిసిన వర్షానికి నగరంలోని దాదాపు 1500 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. చాలా ప్రాంతాల్లో నిన్నటి నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది.
దీనికి తోడు హైదరాబాద్‌కు పశ్చిమంగా 50 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉండడంతో అప్రమత్తమైన ప్రభుత్వం మరో మూడు రోజులపాటు ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది.