రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పగటిపూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోయాయి. బోరబండలో అత్యధికంగా 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉక్కపోతను అధికమించేందుకు ప్రజలు నానాతంటాలు పడుతున్నారు. మరోవైపు, విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరిగిపోయింది.
హైదరాబాద్ వాతావరణం కేంద్రం వెల్లడించిన వివరాల మేరకు మంగళవారం హైదరాబాద్ నగరంలోని బోరబండలో అత్యధికంగా 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, ఖైరతాబాద్‌లో 40.1 డిగ్రీలు, శేరిలింగంపల్లిలో 39.9 డిగ్రీలు, షేక్‍పేటలో 38.9 డిగ్రీలు, మియాపూర్‌లో 38.7, సరూర్ నగర్‌లో 38.1, కాప్రాలో 38 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా రాత్రిపూట కూడా ఈ ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతున్నాయి. మంగళవారం రాత్రి ఏకంగా 25 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది.
అయితే, బుధవారం మాత్రం హైదరాబాద్ నగరంపై ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, సాంయంత్రం, రాత్రి వేళల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఎండలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. ఈ నెల 3వ తేదీన గరిష్టంగా 69.10 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం పెరిగిపోయింది.