సంగారెడ్డి సభ వెనుక జగ్గారెడ్డి..? తెలంగాణ జనసేన లీడర్‌గా మారుతారా? పవన్ ఐడియా ఏంటి?

గురువారం, 16 మార్చి 2017 (15:59 IST)
తెలుగు రాష్ట్రాల్లో జనసేన 2019లో పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో, ఇరు రాష్ట్రాల్లోని పార్టీలకు ముచ్చెమటలు పట్టాయి. రాష్ట్ర విభజన సమయంలో బీజేపీ, టీడీపీకి సపోర్ట్ చేసి.. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తెచ్చిన పవన్ కల్యాణ్.. ఎన్నికల్లో పోటీ చేస్తే ఇంకేమైనా ఉందా అంటూ రాజకీయ పార్టీలు జడుసుకుంటున్నాయి. ఇప్పటికే ఇరు రాష్ట్రాల్లోనూ జనసేన పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా.. ప్రజా సమస్యలపై పోరాడుతుందని తెలిపారు. 
 
ఇందులో భాగంగా తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడాన్ని సంగారెడ్డి సభ నుంచి ప్రారంభించనున్నట్టు పవన్ సంకేతాలు పంపారు. అయితే, సంగారెడ్డిలో ఈ సభ ఏర్పాటు వెనుక కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ముందు నుంచే, పవన్‌తో జగ్గారెడ్డికి మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ సంబంధాల ఆధారంగా సంగారెడ్డిలో పవన్ సభ ఏర్పాట్లు దగ్గర నుంచి జన సమీకరణ వరకు జగ్గారెడ్డే అన్నీ చూసుకుంటున్నారని తెలిసింది. 
 
మరో విషయం ఏమిటంటే, జనసేన పార్టీలో జగ్గారెడ్డి చేరనున్నారని, సంగారెడ్డిలో నిర్వహించనున్న భారీ సభలో జగ్గారెడ్డి జనసేన పార్టీ కండువా కప్పుకోనున్నారని సమాచారం. ఇప్పటికే పలుమార్లు జగ్గారెడ్డి పవన్‌ను కలిసారు. ఇటీవల సంగారెడ్డిలో జరిగిన సినిమా షూటింగ్ సందర్భంగా కూడా జగ్గారెడ్డి పవన్‌ను కలిశారు. ఈ భేటీలో చర్చించిన అంశాలను బయటపెట్టేందుకు నిరాకరించారు. ఇంకా సంగారెడ్డి షూటింగ్ సందర్భంగా పవన్‌ను భారీ ఎత్తున ప్రజలు, ఫ్యాన్స్ కలవడంతో.. అదే ప్రాంతం నుంచి పార్టీని బలోపేతం చేసే పనుల్ని మొదలెట్టాలని పవన్ భావిస్తున్నారు. 
 
2019 ఎన్నికల్లో పవన్ అనంతపురం నుంచి పోటీ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు. అలాంటప్పుడు తెలంగాణలో జనసేనను ఎవరు లీడ్ చేస్తారు. అనే దానిపై సంగారెడ్డి సభ ద్వారా నిజాలు బయటకి వస్తాయి. ఈ సభలో జగ్గారెడ్డి జనసేనలో చేరుతారని, అదే సభలో అధికారికంగా తెలంగాణ బాధ్యతలు జగ్గారెడ్డికి అప్పగించే యోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి