ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉక్కు పరిశ్రమను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఖమ్మంలో బుధవారం జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విశాఖ ఉక్కును ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వమన్నారు. విశాఖ ఉక్కును ప్రధాని నరేంద్ర మోడీ ప్రైవేటుపరం చేస్తే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి కొనుగోలు చేస్తామని తెలిపారు.
"మేక్ ఇన్ ఇండియా .. జోక్ ఇన్ ఇండియా"గా మారిపోయిందన్నారు. అలాగే, అధికారంలోకి వచ్చిన మరుక్షణమే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు. రానున్న కొద్ది రోజుల్లో బీఆర్ఎస్ విధి విధానాలను ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు. 150 మంది మేధావులు తమ పార్టీ విధి విధానాలను రూపొందిస్తున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. భారత జీవిత బీమా సంస్థ ఎల్ఐసీని అడ్డికి పావుసేరుకు అమ్ముతారా? అని నిలదీశారు. ఎల్ఐసీ కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. అలాగే, ఎల్ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లు బీఆర్ఎస్‌ను బలపరచాలని కోరారు. విద్యుత్ సెక్టార్‌ను ప్రభుత్వ రంగంలోనే ఉంచుతామన్నారు. దేశంలో లక్ష కోట్ల మెగావాట్ల జల విద్యుత్‌కు అవకాశం ఉందని, అవసరం ఉన్నచోట వ్యాపారం చేయడం ప్రభుత్వం విధానమన్నారు. తెలంగాణాలో అమలవుతున్న దళితబంధు పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.