సప్త ముఖాలతో కాల సర్పదోష నివారకుడిగా హైదరాబాద్ ఖైరతాబాద్ గణపతి ఈ ఏడాది దర్శనమివ్వనున్నాడు. ఈ గణపతిని 57 అడుగుల ఎత్తు, 27 అడుగుల వెడల్పుతో రూపొందించనున్నారు. ఈ మేరకు గత నెల 25న కర్రపూజకు అంకురార్పణ జరిగింది.
ఈ మోడల్‌లో ఖైరతాబాద్ గణపతి.. శాంత చిత్తంతో ఉన్న ఏడు గణపతి ముఖాలు, 14 చేతులు అందులో కుడి వైపు ఆంకుశం, చక్రం, కత్తి, సర్పం, బాణం, గధతో కూడి ఆశీర్వదిస్తుండగా, ఎడమ వైపు పాశం, శంకు, కమలం, ఢమరుకం, విల్లూ, కడియం, లడ్డూ ఉంటాయి. 57 అడుగుల గణపతికి మరో మూడు అడుగుల ఎత్తులో ఏడు తలల శేషుడు తన పడగతో నీడ కల్పిస్తాడు.
వెనుక వైపు ఆరు ఏనుగులు ఐరావత రూపంలో స్వామి వారిని కొలుస్తున్నట్లు కనిపిస్తాయి. గత ఆనవాయితిని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా రెండు వైపులా చిరు మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. గణేశుడికి కింద నుంచి కుడి వైపున 14 అడుగుల ఎత్తులో లక్ష్మీదేవి, ఎడమ వైపున చదువుల తల్లి సరస్వతి అమ్మవార్లు ఆసీనులై ఉంటారు. పాదల దగ్గర ఆయన వాహనం ఎలుక స్వామి వారికి భజన చేస్తూ కనిపిస్తుంది.