టీ కాంగ్రెస్‌ను ప్రక్షాళన చేయకుంటే శవపరీక్షకే మిగులుతుంది: కోమటిరెడ్డి

శనివారం, 4 జూన్ 2016 (15:59 IST)
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని తక్షణం ప్రక్షాళన చేయకుంటే చివరకు శవపరీక్షకు మాత్రమే మిగులుతుందని టీ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన శనివారం మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు.

వరంగల్ ఉప ఎన్నికలో పోటీ పెట్టొద్దని జానారెడ్డికి చెప్పినా వినలేదని ఆయన అన్నారు. అంతేకాక ఎప్పుడూ లేని విధంగా జీహెచ్‌ఎంసీలో ఘోరంగా ఓడిపోయామని ఆయన అన్నారు. పాలేరులో రాంరెడ్డి సతీమణిని పీసీసీ పట్టించుకోలేదని కోమటి రెడ్డి ఆరోపించారు. తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తికి పీసీసీ చీఫ్‌ ఇస్తే బాగుండేదిని ఆయన అభిప్రాయ పడ్డారు. 
 
ప్రస్తుతం పీసీసీ చీఫ్‌గా పొన్నాల లక్ష్మయ్యను మించిన అసమర్ధుడు కొనసాగుతున్నారని మండిపడ్డారు. వరుస ఓటములకు బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను పీసీసీ చీఫ్‌గా ఉండి ఉంటే పదవికి రాజీనామా చేసేవాడినని చెప్పుకొచ్చారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై సోనియా గాంధీకి లేఖ రాస్తానని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరో ఇప్పుడే ప్రకటించాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. పార్టీలోని ఓ 15 నుంచి 20 మంది సీనియర్ నేతలు తామే సీఎం అభ్యర్థి అని కలలు కంటున్నారని, వాటికి చెక్ పెట్టాలంటే ఇప్పుడే పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించాలని ఆయన సూచించారు. 

వెబ్దునియా పై చదవండి