లష్కర్‌ బోనాలు ప్రారంభం - తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని

ఆదివారం, 17 జులై 2022 (10:11 IST)
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరిగే లష్కర్‌ బోనాల మహోత్సవాలకు సికింద్రాబాద్‌ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయం సిద్ధమైంది. ఉత్సవాల్లో తొలిరోజైన ఆదివారం తెల్లవారుజామున 4:05 నిమిషాలకు ఆలయ ద్వారాలు తెరవనున్నారు. తొలుత అమ్మవారికి మహామంగళ హారతి ఇవ్వనున్నారు. 
 
అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కుటుంబ సభ్యులు అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. తొలిరోజు ముఖ్యమంత్రితోపాటు పార్టీ నేతలు, సంఘాల నాయకులు అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం సాధారణ భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించనున్నారు. 
 
తొలి బోనం సమర్పించిన తర్వాత మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, రైతులు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అందరినీ బోనాల జాతరకు ఆహ్వానించామని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. 
 
మరోవైపు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శనం చేసుకోనున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని వరద ముంపును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఆ తర్వాత ఏటూరునాగారం మీదుగా హైదరాబాద్‌కు వస్తారు. ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో పాల్గొంటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు