మరదలిని అనుమానం చంపి సంపులో పడేశాడు.. చివరికి ఆత్మహత్య చేసుకోవాలని..?

సోమవారం, 12 ఏప్రియల్ 2021 (19:36 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అనుమానాలతో ప్రాణాలు తీసే దుర్మార్గుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా వరుసకు బావయ్యే ఓ యువకుడు అనుమానంతో మరదలి గొంతు నులిమి హత్య చేశాడు. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ఈనెల 10న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళ్తే.. మూసాపేట హబీబ్‌నగర్‌కు చెందిన సోమేశ్వరరావు, నీలమ్మ దంపతుల చిన్న కుమార్తె మంజుల (19) నగరంలో బీటెక్‌ చదువుతోంది. కూకట్‌పల్లి ఏవీబీ పురానికి చెందిన ఢిల్లేశ్వరరావు చిన్న కుమారుడు భూపతి ఈమెకు వరుసకు బావ అవుతాడు. సమీప బంధువులు కావడంతో పెద్దలు వీరికి వివాహం చేయాలని గతంలోనే నిర్ణయించారు.
 
అయితే మంజుల తనను దూరం పెట్టి ఇతర యువకులతో సన్నిహితంగా ఉంటోందని భావించిన భూపతి.. ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 10న ఎవరూ లేని సమయంలో మంజులను తన ఇంటికి పిలిచాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసినట్లు తెలుస్తోంది. దీంతో క్షణికావేశానికి గురైన భూపతి.. మరదలి గొంతు నులిమి హతమార్చాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఇంటి ఆవరణలోని నీటి సంపులో పడేశాడు. 
 
ఆపై తానూ ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించినా.. ధైర్యం చాలకపోవడంతో అదే రోజు కూకట్‌పల్లి ఠాణాకు వచ్చి లొంగిపోయినట్లు సీఐ నరసింగరావు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు