గర్భిణీ కోసం హోరు వానలో మెట్రో రైలు నడిపారు, ఏం జరిగింది?

శనివారం, 17 అక్టోబరు 2020 (17:15 IST)
సమయం రాత్రి 9.30 గంటలు కావస్తోంది. ఓ ప్రక్క హోరున వాన కురుస్తోంది. అది హైదరాబాదులోని వీఆర్ కొత్తపేటలోని మెట్రో స్టేషన్. ఓ గర్భిణీ ఆ రాత్రి సమయంలో అక్కడికి వచ్చింది. తాను మియాపూర్ వెళ్లాలని, కానీ తను వెళ్లడానికి బస్సులు, ఆటోలు అందుబాటులో లేవని అక్కడి సిబ్బందికి తెలిపింది.
 
కోవిడ్ నిబంధనలతో మెట్రో రైళ్లు ఉదయం 7 నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే తిరుగుతున్నాయి. ఆమె అక్కడికి వచ్చే సమయానికి రాత్రి మెట్రో ట్రైన్ వెళ్లిపోయింది. అక్కడి సిబ్బంది కూడా అదే విషయాన్ని ఆమెకు తెలిపారు. దీంతో ఆమె సిబ్బందితో ఏలాగైనా తాను మియాపూర్ వెళ్లాలని దానికి సహాయం చెయ్యాలని ప్రాధేయపడింది. దీంతో అక్కడి సిబ్బంది తమ పైఅధికారులకు విషయాన్ని చేరవేశారు.
 
తమ ప్రయత్నంగా ఆమె పరిస్థితిని తెలిపారు. దీంతో స్పందించిన అధికారులు ఆమె ఒక్కరి కోసమే మెట్రో సర్వీసును సిద్దం చేశారు. ఆమెను మెట్రోలో ఎక్కించుకుని 40 నిమిషాల్లో మియాపూర్ చేర్చారు. ఆమె క్షేమంగా మియాపూర్ చేరడానికి సహకరించారు. ఆ విషయాన్ని మెట్రో భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైల్ ఎమ్‌డీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. అత్యవసర సమయాల్లో పౌరులను కాపాడేందుకు మెట్రో నడపాలని నిబంధన ఉందన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు