టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. పదేపదే తన పేరు ప్రస్తావించడంపై తీవ్రంగా స్పందించారు టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు.. పదేపదే ఈటల నా పేరు ప్రస్తావించడం ఆయన భావదారిద్ర్యానికి నిదర్శనమన్న హరీష్.. ఈటల వ్యాఖ్యలను ఖండించారు.
ఈటల టీఆర్ఎస్ పార్టీకి చేసిన సేవ కంటే.. పార్టీ ఆయనకు ఇచ్చిన అవకాశాలే ఎక్కువని వ్యాఖ్యానించిన ఆయన.. రాజేందర్.. పార్టీని వీడినా టీఆర్ఎస్‌కు వచ్చిన నష్టం ఏమీలేదన్నారు.. నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు కేసీఆర్ మాట జవదాటకుండా నడుచుకుంటానని స్పష్టం చేసిన హరీష్‌రావు.. కేసీఆర్ పార్టీ అధ్యక్షుడే కాదు.. నాకు గురువు, మార్గదర్శి, తండ్రితో సమానులు అని వెల్లడించారు.
తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందన్నట్టుగా ఉన్నది ఈటల రాజేందర్ గారి వైఖరి అంటూ మండిపడ్డారు. పార్టీని వీడడానికి ఆయనకు అనేక కారణాలుండొచ్చు. పార్టీలో ఉండాలా.. వెళ్లిపోవాలా అన్నది ఆయన ఇష్టం. ఆయన పార్టీని వీడిన టీఆర్ఎస్ పార్టీకి వీసమెత్తు నష్టం కూడా లేదన్న హరీష్.. ఆయన పార్టీకి చేసిన సేవకన్నా.. పార్టీ ఆయనకు ఇచ్చిన అవకాశాలే ఎక్కువ.
తన సమస్యలకు, తన గొడవకు నైతిక బలం కోసం పదేపదే నా పేరును ప్రస్తావించడం ఈటల రాజేందర్ భావదారిద్య్రానికి, విజ్ఙత, విచక్షణలేమికి నిదర్శనం అన్నారు.. నా భుజాల మీద తుపాకి పెట్టాలనుకోవడం విఫల ప్రయత్నం మాత్రమే కాదు.. వికారమైన ప్రయత్నం కూడా. ఆయన మాటల్లో మనో వికారమే తప్ప సత్యం ఎంత మాత్రం లేదు. నా గురించి ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తన ప్రకటనలో పేర్కొన్నారు మంత్రి హరీష్‌రావు.
టీఆర్ఎస్ పార్టీలో నేను నిబద్దత, విధేయత, క్రమశిక్షణ ఉన్న కార్యకర్తను.. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు నాకు పార్టీ ప్రయోజనాలే పరమావధి. పార్టీ కార్యకర్తగా ఉన్న నాకు పార్టీ, నాయకత్వం ఏ పని అప్పగించినా దాన్ని పూర్తిచేయడం నా విధి, బాధ్యత. పార్టీ నాయకుడిగా కేసీఆర్ ఏ ఆదేశం ఇచ్చినా శిరసావహించడం నా కార్తవ్యంగా భావిస్తాను అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.