కేటీఆర్ వద్దు, ఈటలను సీఎం చేయండి: చెరుకు సుధాకర్

గురువారం, 4 ఫిబ్రవరి 2021 (13:47 IST)
తెలంగాణలో తదుపరి సీఎంగా కేటీఆర్ రాబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ, 'తెలంగాణ ఇంటి పార్టీ' అధ్యక్షుడు, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చెరుకు సుధాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కనుక, బీసీలకు న్యాయం జరుగుతుందని సోనియాగాంధీ భావించారని.. అయితే, దళితుడిని మొదటి సీఎం చేస్తానన్న కేసీఆర్, తానే ఆ పదవిని అనుభవిస్తున్నారని సుధాకర్ మండిపడ్డారు.
 
ఇప్పుడు తన కుమారుడు కేటీఆర్‌ను సీఎం చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోందని, కేటీఆర్  స్థానంలో ఈటల రాజేందర్‌ను సీఎం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వస్తే, 3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, ఇప్పటివరకూ అది జరగలేదని విమర్శలు గుప్పించారు.
 
ప్రభుత్వ లెక్కల ప్రకారం 1.35 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్టు చెప్పుకుంటున్నా, అందులో ఎంతమాత్రమూ స్పష్టత లేదని వ్యాఖ్యానించిన సుధాకర్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో కోదండరామ్‌కు ఎన్డీయే నేతలు ఎందుకు మద్దతిస్తున్నారో తెలియడం లేదని అన్నారు. తాను కమ్యూనిస్టు ఉద్యమాల్లో తరచూ పాల్గొంటున్న వాడినని, తాను విజయం సాధిస్తే, విద్యావంతుల సమస్యలు తీర్చేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. తనను గెలిపించాలని పట్టభద్రులను ఆయన కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు