పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ ధ‌ర‌ల‌ను త‌క్ష‌ణ‌మే త‌గ్గించాలి: టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌

మంగళవారం, 2 మార్చి 2021 (09:36 IST)
పెరిగిన గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్ ధ‌ర‌లు పేద‌ల పాలిట పెనుభారంగా మారాయ‌న్నారు టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. నాంప‌ల్లి గృహ‌క‌ల్ప వ‌ద్ద మ‌హిళా కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన వంటావార్పు కార్య‌క్ర‌మంలో ఆయ‌నతో పాటు ఎమ్మెల్యే సీత‌క్క‌, అధికార ప్ర‌తినిధులు ఇందిరాశోభ‌న్ త‌దిత‌ర మ‌హిళా నేత‌లు పాల్గొన్నారు.

ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..యూపీఏ హ‌యాంలో కంటే ఎన్డీయే హ‌యాంలో ధ‌ర‌లు మూడు రెట్లు అధికమ‌య్యాయ‌ని ఆరోపించారు. కేంద్రంలోని మోదీ స‌ర్కార్ , రాష్ట్రంలోని కేసీఆర్ ప్ర‌భుత్వాలు పేద‌ల జీవితాల‌తో చెల‌గాటమాడుతున్నార‌ని విమ‌ర్శించారు. ఈ రెండు ప్ర‌భుత్వాల ఘ‌న‌కార్యం వ‌ల్ల సామాన్యుడు బ‌త‌లేని ప‌రిస్థితి దాపురించింద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

ధ‌ర‌లు త‌గ్గే వ‌ర‌కు పేద‌ల ప‌క్షాన కాంగ్రెస్‌ పోరాటం చేస్తుంద‌న్నారు. చ‌దువుకున్న మేథావులంతా పెరుగుతు‌న్న ధ‌ర‌ల‌పై ఆలోచన‌ చేయాల‌ని.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో  కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాలకు త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.

అనంత‌రం ములుగు ఎమ్మెల్యే సీత‌క్క మాట్లాడుతూ.. నిత్య‌వ‌స‌ర ధ‌ర‌లు వంద రోజుల్లో త‌గ్గిస్తామ‌ని చెప్పి అధికారంలోకి వ‌చ్చిన కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు.. నిత్యం ధ‌ర‌లు పెంచుతూ పేద‌ల న‌డ్డి విరుస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. క‌రోనా వచ్చి దేశమంతా క‌ష్ట‌కాలంలో ఉంటే.. ప‌న్నుల పేరుతో సామాన్యుల‌పై ఇలా భారం మోప‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ఆమె ప్ర‌శ్నించారు.

మేమిద్దం.. మాకిద్ద‌రు అన్న చందంగా అదానీ, అంబాల‌నీల‌కు  మోదీ, అమిత్‌షాలు దేశ సంప‌ద‌ను దోచిపెడుతున్నార‌ని సీత‌క్క ధ్వజ‌మెత్తారు. రాష్ట్రంలోని మ‌హిళామ‌ణులంద‌రికీ కాంగ్రెస్ పార్టీ అండ‌గా ఉంటుంద‌ని ఆమె తెలిపారు. అటు.. టీపీసీసీ అధికార ప్ర‌తినిధి ఇందిరాశోభ‌న్ మాట్లాడుతూ.. రోజురోజుకూ పెరుగుతున్న ధ‌ర‌లు.. సామాన్యుడి పాలిట గుదిబండ‌లా మారాయ‌న్నారు.

మోదీ పాల‌న‌లో పేద‌లు క‌నీసం బ‌త‌క‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డటం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. బ‌డ్జెట్ స‌మ‌యంలో అచ్చేదిన్  వ‌చ్చిదంటూ నిర్మ‌లాసీతారామ‌న్ ప్రగ‌ల్బాలు ప‌లికింద‌ని.. కానీ నేడు అచ్చేదిన్ ఏమోగానీ సామాన్యులు మాత్రం స‌చ్చెదిన్ అని చెప్ప‌క ‌త‌ప్పద‌న్నారు.

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ ధ‌ర‌ల‌తో సామాన్యుల జేబులు ఏ రోజుకారోజు ఖాళీ అవుతున్నాయ‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పెంచిన ధ‌ర‌ల‌ను త‌గ్గించే వ‌ర‌కు త‌మ పోరాటాన్ని కొన‌సాగిస్తామ‌ని ఇందిరాశోభ‌న్ హెచ్చ‌రించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు