ఇండియా టుడే ప్రీ-పోల్ సర్వే.. తెలంగాణలో కేసీఆరే సీఎం.. తిరుగులేదు

శనివారం, 15 సెప్టెంబరు 2018 (11:15 IST)
ఇండియా టుడే మీడియా గ్రూప్ నిర్వహించిన తాజా సర్వే గురించి తెలుగునాట పెద్ద చర్చ మొదలైంది. 2019 ఎన్నికల్లో ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఎంపిక అవుతారని తాజా ప్రీ పోల్ సర్వేలో తేలగా, తెలంగాణలో జరిగే శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుదే హవా అని ఆ ప్రీపోల్ సర్వే తెలియజేసింది. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని తెలంగాణలోని అత్యధికులు కోరుకుంటున్నట్లు ఆ సర్వే బయటపెట్టింది. 
 
ప్రజాదరణ విషయంలో కేసీఆర్‌కు 43 శాతం మద్దతు పలుకగా, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి 18 శాతం,, బీజేపీ నేత కిషన్‌రెడ్డికి 15 శాతం, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి 4 శాతం మద్దతు ఉందని ఆజ్‌తక్ సర్వేలో తేలింది. ఓటింగ్ శాతాలపరంగా చూసినా, సీట్లపరంగా చూసినా, ముఖ్యమంత్రి అభ్యర్థి రీత్యా చూసినా టీఆర్‌ఎస్‌కు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు దరిదాపుల్లో ఎవరూ లేరని సర్వే ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఆజ్‌తక్- ఇండియాటుడే మీడియా గ్రూపు, వీడీపీ అసోసియేట్స్‌లు వేర్వేరుగా నిర్వహించిన సర్వేలు ఈ విషయాన్ని బయటపెట్టాయి. 
 
గత నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టిస్తుందని  తాజా ప్రీ పోల్ సర్వేలో వెల్లడి అయ్యింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేసీఆర్‌కు మద్దతుగా 43శాతం ఓటర్లు నిలుస్తారని ఆజ్‌తక్-ఇండియాటుడే సర్వే తేల్చింది. వీడీపీ అసోసియేట్స్ నిర్వహించిన సర్వేలో 51 శాతం ఓటర్లు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నారని తేలింది.  రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు 80 సీట్లు లభిస్తాయని వీడీపీ అసోసియేట్స్ సర్వే తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు