హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం.. వచ్చే మూడు రోజులు ఇదే పరిస్థితి..

ఆదివారం, 21 మే 2023 (17:56 IST)
హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ఆదివారం వర్షం కురిసింది. వచ్చే మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నగరంలోని ప్రధాన ప్రాంతాలైన కూకట్‌పల్లి, మణికొండ, గచ్చిబౌలి, సుచిత్ర, కొంపల్లి తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలు వర్షం రాకతో కాస్త ఉపశమనం కలిగిందని చెప్పొచ్చు. అయితే, ఈ చిన్నపాటి వర్షానికే రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో పాదాచారాలు, వాహనదారులు అవస్థలు పడ్డారు. 
 
మరోవైపు, తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ద్రోణి విదర్భ నుంచి మరఠ్వాడ, ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది. 
 
వచ్చే మూడు రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 39 నుంచి 41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు