హైద‌రాబాదులో కూలనున్న భవనాల ఖరీదు రూ.200 కోట్లు

శుక్రవారం, 4 నవంబరు 2016 (18:43 IST)
హైద‌రాబాద్ : ఉన్న‌వి కూల్చు... కొత్త‌వి క‌ట్టు... అపుడేగా నాలుగు పైస‌లు వెన‌కేసుకునేది... అన్న‌ట్లుంది తెలంగాణాలో టీఆర్ఎస్ పాల‌న‌. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న భవనాలను కూల్చేసి ఆ స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం ఎంతో పట్టుదలగా ఉంది. ప్రస్తుతం హైకోర్టులో ఉన్న ఈ అంశంపై త్వరలోనే క్లియరెన్స్ రావడం ఖాయమని తెలుస్తోంది. కానీ, సీఎం కేసీఆర్ కూల్చాలని భావిస్తున్న భవనాల్లో ఎలాంటి లోపాలు లేవని తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ సచివాలయంలో నాలుగు బ్లాకులు ఉండగా…అందులో ఒక బ్లాక్‌ను 2000 సంవత్సరంలో టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో నిర్మించారు. 
 
అప్పట్లోనే ఇందుకోసం దాదాపు రూ.40 కోట్లు ఖర్చు చేశారు. అత్యాధునికమైన హంగులు అప్పట్లో నిర్మించిన బ్లాకులో ఉన్నాయి. ప్ర‌స్తుత లెక్కల ప్రకారం ప్రభుత్వం కూల్చబోతున్న భవనాల ఖరీదు దాదాపు రూ.200 కోట్లకు పైగా మాటే అని తెలుస్తోంది. ఈ భవనాలను కూల్చడం ద్వారా తెలంగాణ ఖజానాపై ఆ స్థాయి భారం పడుతుందని సమాచారం. 
 
ఒకవేళ తెలంగాణ సచివాలయాన్ని మరో చోట నిర్మిస్తే… ఈ భవనాలను మరో అవసరం కోసం వినియోగించవచ్చని… అప్పుడు ఈ మొత్తం మిగుతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో తెలంగాణ కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకోవడంతో… భవనాల కూల్చివేత కారణంగా ప్రభుత్వానికి రూ.200 కోట్ల నష్టం ఖాయమని అర్థమవుతోంది.

వెబ్దునియా పై చదవండి