భర్త చనిపోయిన మహిళ కారుణ్య నియామకం క్రింద అటెండర్ పోస్ట్‌కి దరఖాస్తు చేయగా ఒక అధికారి లంచం అడిగాడు. దాన్ని తీసుకోవడానికి మూడు చోట్లు మార్చాడు... అయినా పట్టుబడిపోయాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం, శ్రీరాంపురం గ్రామానికి చెందిన వి.మల్లేశ్వరరావు పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తూ అనారోగ్యంతో మరణించాడు. అతని భార్య నాగలక్ష్మి కారుణ్య నియామకం క్రింద అటెండర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది.
కుటుంబ భారాన్ని మోసే భర్తను పోగొట్టుకుని శోక సముద్రంలో మునిగి ఉన్న ఆమెకు సహాయం చేయకపోగా, ఆ దస్త్రాన్ని ఆమోదించేందుకు సచివాలయంలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్దిశాఖ కార్యాలయంలో సెక్షన్ అధికారిగా పనిచేసే నాగరాజు రూ.60 వేలు లంచం అడిగాడు. లంచం కోసం నాగరాజు వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు లంచం ఇవ్వడానికి ఒప్పుకుంది. అదే సమయంలో అవినీతి నిరోధకశాఖ (అనిశా) అధికారులను సంప్రదించింది.