తెలుగుదేశంలో టిడిపి అధినేత నుంచి నేటి అధినేత చంద్రబాబు వరకు అదే సామాజిక వర్గం. ఇతర కీలక నేతలు కూడా కమ్మ సామాజికవర్గం నుంచే ఉంటారనేది స్పష్టంగా కనిపించే విషయమే. అయితే రాష్ట్ర విభజన తరువాత తెలంగాణాలో తెలుగుదేశం ప్రాభవం కోల్పోవడంతో పాటు కమ్మకులానికి చెందిన ఓటర్లతో పాటు ఓటర్ల మైండ్ సెట్లో మార్పు వచ్చిందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
2018 తెలంగాణా ఎన్నికలు పూర్తయ్యే సరికి స్పష్టమైన ఈక్వేషన్లు కనిపిస్తున్నాయని చెప్పాలి. 2018 ఎన్నికల్లో ప్రజా ఫ్రంట్‌గా ఏర్పడ్డ పార్టీల్లో టిడిపి అభ్యర్థులగా 13 మంది తమ స్థానాల్లో నిలబెట్టింది. అభ్యర్థులు నిలబెట్టిన స్థానాల్లో కొన్ని కమ్మ సామాజికవర్గానికి చెందిన ప్రజలు ఎక్కువమంది ఉన్నారు. దీంతో ఆ ప్రాంతంలో కమ్మ సామాజికవర్గానికి చెందిన నాయకులకే టిక్కెట్లు ఇచ్చారు చంద్రబాబు. కానీ ఎన్నికల ఫలితాలు మాత్రం దీనికి రివర్స్‌లో వచ్చాయి.
తెలంగాణాలో బరిలోకి దిగిన 13 స్థానాలలో ముగ్గురు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాతినిథ్యం కల్పించారు. నామా నాగేశ్వరరావు, భవ్య ఆనందప్రసాద్, నందమూరి సుహాసినికి టిక్కెట్టు ఇచ్చారు. అభ్యర్థుల విజయం కోసం తీవ్ర ప్రచారం కూడా చేశారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ముగ్గురు అభ్యర్థులు ఓడిపోయారు. ఇదలా ఉంటే టిఆర్ఎస్‌లో ఉన్న కమ్మ వర్గానికి చెందిన నాయకులను ప్రజలు గెలిపించారు. దీంతో విశ్లేషకులే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.