హైదరాబాద్ హాస్టల్ వార్డెన్ వికృత చేష్టలు.. ట్విట్టర్‌లో చిన్మయి బట్టబయలు

బుధవారం, 2 డిశెంబరు 2020 (11:32 IST)
సమాజంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ముఖ్యంగా హాస్టళ్లల్లో ఉండే అమ్మాయిలపై వార్డెన్లు పాల్పడే అకృత్యాలకు అంతే లేకుండా పోతోంది. ఇటీవల గుజరాత్‌లో ఓ లేడీస్‌ హాస్టల్‌లో వార్డెన్‌ అమ్మాయిల పట్ల ఎలాంటి వికృత ప్రవర్తనను చూపించింది. అలాంటి ఘటనే హైదరాబాద్‌లోనూ జరిగిందంటూ సింగర్ చిన్మయ్ బయటపెట్టింది.
 
దక్షిణాదిన మీ టూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ముందుంటున్న సింగర్‌ చిన్మయి పలు రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక ఇబ్బందులను తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఓ వార్డెన్ పైశాచికత్వంపై బాధితురాలి స్పందనను ట్విట్టర్‌ ద్వారా చిన్మయి తెలియజేశారు. 
 
బాధితురాలి కథనం ప్రకారం 'నేను 2015లో పదో తరగతి చదివేదాన్ని. హైదరాబాద్‌లోని ఓ స్కూల్‌లో చదువుకుంటూ అక్కడే హాస్టల్‌లో ఉండేదాన్ని. అక్కడ వార్డెన్ అమ్మాయిలను చాలా ఇబ్బందులు పెట్టేది. పీరియడ్స్ వచ్చాయని చెబితే వెంటనే నమ్మేది కాదు.
 
బట్టలు విప్పి చూపించమనేది. అలాంటి పరిస్థితి నాకూ ఓ రోజు వచ్చింది. క్లాసులో ఉండగా నాకు పీరియడ్స్ వచ్చాయి. దీంతో టీచర్ పర్మిషన్ తీసుకుని హాస్టల్‌కి వెళ్లగా వార్డెన్ లోనికి అనుమతించలేదు.
 
స్కూల్ టైమ్‌లో ఇక్కడికెందుకు వచ్చావంటూ తిట్టింది. పీరియడ్స్ వచ్చాయని చెప్పగా నమ్మలేదు. బట్టలు విప్పి చూపించమనడంతో అలాగే చేశాను. ఆ తర్వాతే నన్ను హాస్టల్‌లోకి అనుమతించింది. ఆనాటి ఘటన తలుచుకుంటే ఇప్పటికీ నాకు బాధేస్తుంటుంది' అని చెప్పుకొచ్చింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు