దసరా స్పెషల్ రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. వివరాలివే...

గురువారం, 15 అక్టోబరు 2020 (10:30 IST)
దసరా పండుగను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే కొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు ఈ నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నడవనున్నాయి. ముఖ్యంగా, ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే కాకినాడ, తిరుపతి, నర్సాపూర్, మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతాలకు ఈ రైళ్లను నడుపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ రైళ్ళ వివరాలను పరిశీలిస్తే, 
 
* లింగంపల్లి - కాకినాడ పోర్ట్‌ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ లింగంపల్లిలో రాత్రి 8.30 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 7.20 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కాకినాడలో రాత్రి 7.10 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 6.05 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. ఈ రైళ్లు వరంగల్ మీదుగా ప్రయాణించనున్నాయి.
 
* లింగంపల్లి నుంచి తిరుపతి వెళ్లే రైలు సాయంత్రం 5.30 గంటలకు లింగంపల్లి స్టేషన్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతిలో సాయంత్రం 6.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.55 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. ఈ రైలు బీబీనగర్, నడికుడి మార్గంలో ప్రయాణిస్తాయి. లింగంపల్లి - కాకినాడ, లింగంపల్లి - తిరుపతి రైళ్లు ఈ నెల 20 నుంచి సేవలు ప్రారంభించనున్నాయి.
 
* ఇక లింగంపల్లి - నర్సాపూర్ మధ్య ఈ నెల 23 నుంచి నవంబరు 30 వరకు ప్రతి రోజూ రైలు నడవనుంది. లింగంపల్లిలో రాత్రి 9.05 గంటలకు బయలుదేరి ఆ తర్వాతి రోజు 7.45కు నర్సాపూర్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నర్సాపూర్‌లో సాయంత్రం 6.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.50కి లింగంపల్లికి చేరుకుంటుంది. ఈ రైళ్లు నల్గొండ మీదుగా నడుపుతారు. 
 
* అదేవిధంగా తిరుపతి నుంచి మహారాష్ట్రలోని అమరాతి మధ్య ఈ నెల 22 నుంచి ప్రతి రోజూ రైళ్లు నడవనున్నాయి. తిరుపతిలో మధ్యాహ్నం 3.10 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు మధ్యాహ్నం 2.50 గంటలకు అమరావతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అమరావతిలో ఉదయం 6.45కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.40 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైళ్లు పాకాల, మహబూబ్‌నగర్, నిజామాబాద్ మీదుగా నడుస్తాయని తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు