విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. భీమా కోరేగావ్ కేసులో ఆయనకు అపెక్స్ కోర్టు బుధవారం ఈ బెయిల్ మంజూరుచేసింది. వైద్య కారణాలతో తనకు శాశ్వత బెయిల్ మంజూరు చేసేందుకు బాంబే హైకోర్టు నిరాకరించడాన్ని ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేశారు.
దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి యూయూ లలిత్, అనిరుద్ధ బోస్, సుధాన్షు ధూలియాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి షరతులతో కూడిన బెయిల్ మంజూరుచేసింది.
కాగా, ఈయన గత రెండున్నరేళ్లుగా కస్టడీలో ఉన్నారు. అలాగే, ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. అయితే, ఈ కేసులో ఇంకా విచారణ మొదలుకాలేదు. చార్జిషీటు దాఖలు చేసినప్పటికీ అభియోగాలు కూడా నమోదు కాలేదని ధర్మాసనం అభిప్రాయపడింది.
అయితే, ముంబైలో ఎన్.ఐ.ఏ కోర్టు అనుమతి లేకుండా ఆయన గ్రేటర్ ముంబైను దాటి వెళ్లకూడదని ధర్మాసనం వరవరరావుకు సూచించింది. అలాగే, ఆయనకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదని, సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించకూడదని స్పష్టంచేసింది. కేవలం వైద్యపరమైన కారణాలతోనే బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ధర్మాసనం స్పష్టం చేసింది.