తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ - పండగ తర్వాత బాదుడే బాదుడు

శుక్రవారం, 31 డిశెంబరు 2021 (10:42 IST)
తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ పండుగకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అలాగే సంక్రాంతి తర్వాత చార్జీలను పెంచాలన్న ఆలోచనతో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ సంక్రాంతి కోసం నడిపే ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేయబోమని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. 
 
ప్రత్యేక చార్జీల బాదుడు లేకుండానే సంక్రాంతికి ప్రత్యేక బస్సులను నడుపుతామని ఆయన ప్రకటించారు. ఈ సంక్రాంతి కసం 4900 ప్రత్యేక బస్సులను నడపాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ కారణంగా 2.50 లక్షల సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రత్యేక బస్సుల్లో 1600 బస్సులను ఏపీలోని 30 ముఖ్య పట్టణాలకు నడుపుతారు. 
 
మరోవైపు, సంక్రాంతి తర్వాత ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచాలన్న ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఒక వైపు అప్పులు, మరోవైపు నష్టాలు పెరిగిపోతుండటంతో చార్జీల పెంపునకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి కోరుతూ అధికారులు పదేపదే ప్రతిపాదనలు పంపుతున్నారు. వీటిపై సీఎం సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. 
 
ఈ ప్రాథమిక ప్రతిపాదనల ప్రకారం... పల్లెవెలుగు బస్సులకు కిలోమీటర్‌కు రూ.25 పైసలు, ఎక్స్‌ప్రెస్ ఆపైన బస్సులకు కిలోమీటరుకు రూ.30 పైసలు, సిటీ ఆర్డీనరి బస్సులకు కిలోమీటరుకు రూ.25, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు రూ.30 పైసలు చొప్పున పెంచేందుకు ప్రతిపాదనలు పంపి, సీఎం అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు